
11/03/2025
*ప్రభుత్వ అధికారిని బెదిరించి, డబ్బులు వసూలు చేసిన రౌడీ షీటర్ ముఠా అరెస్ట్*
తేదీ: 11-03-2025, ఇబ్రహింపట్నం: ఇబ్రహింపట్నం, మెట్‌పల్లి మరియు పరిసర ప్రాంతాలలో గత కొంత కాలం నుండి అక్రమ ఇసుక, మొరం రవాణా, భూమి సెటిల్‌మెంట్ దందాలు చేస్తూ, వారి అక్రమాల పై ఎదురు తిరిగిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్న అమాయక ప్రజలు, వ్యాపారాలు మరియు ప్రభుత్వ అధికారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న రౌడీ షీటర్ ముఠాను మెట్‌పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ. నిరంజన్ రెడ్డి, ఇబ్రహింపట్నం ఎస్సై, ఏ. అనిల్ లు అరెస్టు చేశారు.
అరెస్టు అయిన నిందితుల వివరాలు:
1. రెంజర్ల అజయ్, వయస్సు: 31 సం., కులం: మున్నూరుకాపు, చిరునామా: రాజేశ్వర్‌రాపేట్ గ్రామం, మెట్‌పల్లి మండలం.
2. బత్తుల భరత్, వయస్సు: 36 సం., కులం: ఎస్సీ-మాల, చిరునామా: ఇందిరానగర్, మెట్‌పల్లి మండలం.
3. జెట్టి లక్ష్మణ్, వయస్సు: 33 సం., కులం: మున్నూరుకాపు, చిరునామా: దుబ్బవాడ, మెట్‌పల్లి మండలం.
పరారీలో ఉన్న నిందితుడు: ఎన్నం రమేష్ చిరునామా: రాజేశ్వర్‌రాపేట్ గ్రామం, మెట్‌పల్లి మండలం.
నేర వివరాలు:
నిందితులు ఒక ముఠాగా ఏర్పడి గత కొంత కాలం నుండి అక్రమ ఇసుక, మొరం రవాణా చేస్తూ, సెటిల్‌మెంట్ దందాలు చేస్తూ, అమాయకులను బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు. ఎవరైనా వారి మాట వినకపోతే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరించేవారు. ఈ విధంగా వచ్చిన డబ్బులను పంచుకుని ఖర్చు చేసుకునేవారు.
ముఖ్యంగ ఇందులో బత్తుల భరత్ అనునతడు గతం లో వివిధ నేరాలకు పాల్పడగా అతని పై మెట్పల్లి పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ కలదు మరియు ఇతర కేసుల లో నిందితుడిగా ఉన్నాడు.
తేదీ: 12-02-2025న రెంజర్ల అజయ్ రాజేశ్వర్‌రాపేట్‌లో అక్రమ మొరం రవాణా చేస్తుండగా, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ డీఈఈ లక్కంపల్లి అరుణోదయ్ కుమార్ మరియు వర్క్ ఇన్‌స్పెక్టర్ లస్మయ్యలు అడ్డుకున్నారు. వెంటనే అజయ్ ఈ విషయాన్ని ఎన్నం రమేష్‌కు ఫోన్ ద్వారా తెలియజేయగా, రమేష్ అక్కడికి వచ్చి డీఈఈ అరుణోదయ్ కుమార్‌ను దూషించాడు. వారి అక్రమ రవాణాను అడ్డుకుంటే డీఈఈ అరుణోదయ్ కుమార్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని రమేష్ బెదిరించడంతో డీఈఈ అరుణోదయ్ కుమార్ భయపడి అక్కడి నుంచి పారిపోయారు.
ఆ తర్వాత బత్తుల భరత్ డీఈఈ అరుణోదయ్ కుమార్‌కు ఫోన్ చేసి, కులం పేరుతో దూషించారని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని, చంపుతామని బెదిరించి, కేసు పెట్టకుండా ఉండాలంటే మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తేదీ: 15-02-2025న జెట్టి లక్ష్మణ్ కూడా డీఈఈ అరుణోదయ్ కుమార్‌కు ఫోన్ చేసి, వెంకట్రావుపేట్ గుట్ట వద్దకు వచ్చి మాట్లాడాలని, సమస్య పరిష్కరించుకోవాలని, లేకపోతే చంపుతామని బెదిరించారు. దీంతో భయపడిన డీఈఈ అరుణోదయ్ కుమార్ బత్తుల భరత్‌కు ఫోన్ ద్వారా రెండుసార్లు మొత్తం లక్షా పది వేలు పంపించారు. నలుబై వేలు నగదు రూపంలో జెట్టి లక్ష్మణ్‌కు ఇచ్చారు.
ఆ తర్వాత కూడా తరుచు వారు డీఈఈ అరుణోదయ్ కుమార్ కు ఫోన్ చేసి మిగతా లక్ష యాబైవేల రూపాయలు ఇవ్వాలని లేకపోతే చంపుతామని బెదిరింపులకి పాల్పడగా, వారి వేదింపులు తట్టుకోలేక డీఈఈ అరుణోదయ్ కుమార్ గారు తేది:06-03-2025 రోజున ఇబ్రహింపట్నం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనైనది.
తేదీ: 10-03-2025 రాత్రి ముగ్గురు నిందితులయిన, అజయ్, భరత్, లక్ష్మణ్‌లు గండి హనుమాన్ టెంపుల్ సమీపం లో మెట్‌పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ. నిరంజన్ రెడ్డి, ఇబ్రహింపట్నం ఎస్సై, ఏ. అనిల్ పట్టుకొని వారి వద్ద నుండి రెండు ఫోన్‌లు మరియు ఎనుబై వేల రూపాయల నగదు స్వాధీనపరుచుకొని తదుపరి చర్యల నిమిత్తం కోర్టులో హాజరుపరుచానైనది. పరారీలో ఉన్న మరో నిందితుడు ఎన్నం రమేష్‌ను అతి త్వరలోనే పట్టుకొని కోర్టులో హాజరుపరుస్తామని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.
హెచ్చరిక:
మెట్‌పల్లి సర్కిల్ పరిధిలో ఎవరైనా అక్రమ ఇసుక, మొరం రవాణా, భూముల సెటిల్‌మెంట్ దందాలకు పాల్పడి ప్రజల నుండి డబ్బులు వసూలు చేసినట్టు తెలిస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి మరియు అట్టి నేరస్తులపై పి.డి. ఆక్ట్ విధించబడును..
ఇట్లు
ఏ. నిరంజన్ రెడ్డి,
సర్కిల్-ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్,
మెట్పల్లి.