Spot News

Spot News News

13/06/2018

వృద్ధులు భారం కాదు.
వారు అనుభవ సారాలు.
వారి జ్ఞానాన్ని, అనుభవాల్ని స్వీకరిద్దాం !!!

భీష్ముడి నిర్యాణం !

కాస్తంత పేద్దగా వుంది. ఓపిక తో చదవడం మొదలు పెడితే అదే చదివిస్తుంది. దయచేసి మీరు చదివి తెలియని వారికి వివరించండి.మంచిని అందరికీ పంచండి*
*************************
_*ముసలివారు సమాజానికి బరువా?*_
*************************
ఆధునిక ప్రపంచ వైద్యులను విస్మయ పరిచే అంశం భీష్మ నిర్యాణంలో ఉంది. ప్రపంచంలో మొదటి ఆధునిక అంత్యదశసేవాశ్రమం అనే హాస్పీస్ ను 1967లో ఇంగ్లండుకు చెందిన నర్సు ఏర్పాటు చేసిందని అంటున్నారు. దీనికి ముందర క్రీస్తు శకం 11వ శతాబ్దంలో క్రైస్తవంలోని రోమన్ కేథలిక్కు వర్గానికి చెందినవారు ఏర్పాటు చేశారనే వారు కూడా ఉన్నారు. కానీ వీటన్నింటికన్నా ముందర మహాభారతంలో భీష్మనిర్యాణ ఘట్టంలో అంత్యదశసేవల గురించి అద్భుతమైన వివరణ ఉంది.

భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో 10 రోజులు పోరాడి ఒళ్ళు అంతా బాణాలు గుచ్చుకోగా నేలకు ఒరిగాడు. అయితే ఆయన వెంటనే చనిపోలేదు. 58 రోజులు బాణశయ్య మీద బ్రతికారు. ఆ 58 రోజుల్లో భీష్ముడిని పాండవులు చూసుకున్న తీరులో ఆధునికులు కూడా నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నింటినో తెలుపుతోంది.

భీష్మ నిర్యాణంపై ఆంధ్రవ్యాసుల వారు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘మనం చాలా తప్పు చేస్తున్నాము. సీనియర్ సిటిజన్ల పేరుతో 60 ఏళ్ళ ముద్రవేసి వారిని పట్టించుకోవడంలేదు. కానీ విదేశాల్లో వృద్ధుల నుంచీ ఎన్నో రహస్యాలు తెలుసుకుంటున్నారు. జీవితంలో వారు గడించిన అనుభవాలను విదేశీయులు సేకరించి వారివారి రంగాలకు మెరుగులు దిద్దుకుంటున్నారు. మనం పనికి మాలిన వాళ్ళలాగా మారిపోతున్నాం. ముసలాళ్ళు ఒక బరువు అనుకుంటున్నాము. ఎంతో విలువైన అనుభవసారాన్ని కోల్పోతున్నాము.

ప్రతీ వృద్ధుని దగ్గరా తాను పనిచేసిన రంగంలో విశేషమైన అనుభవజ్ఞానం ఉంటుంది. దాన్ని సేకరించే విభాగం ఒకటి రావాలి. నిజానికి దీనివల్ల వృద్ధులకు కూడా తమను సమాజం నిర్లక్ష్యం చేస్తోంది అనే భావన పోతుంది. మనకు దాని వల్ల వివిధరంగాలకు కావలసిన అనుభవజ్ఞానం వస్తుంది. ఈ విజ్ఞానం ఎన్ని కోట్ల రూపాయల పరిశోధనలు చేసినా దొరకదు. కేవలం వృద్ధుల దగ్గర మాత్రమే ఉంటుంది. దీనికి అద్భుతమైన ఉదాహరణ మహాభారతంలో ఉంది.

18 రోజుల యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యం నాశనం అయ్యాక, దుర్యోధనుడు కూడా చనిపోయాక, ధర్మరాజు పట్టాభిషేకం ద్వారా చక్రవర్తి అయ్యాడు. ఈ సమయంలో వ్యాసుడు, కృష్ణుడు అద్భుతమైన సలహా ధర్మరాజుకు ఇస్తాడు. అప్పటికి భీష్ముడు ఇంకా జీవించే ఉన్నాడని ధర్మరాజుకు గుర్తు చేస్తూ అపారమైన జ్ఞాన సంపద ఆ కురువృద్ధుడి దగ్గర ఉందని ఆయన గతిస్తే ఆయనతో పాటే ఆ మహావిజ్ఞానం అంతరిస్తుందని, కనుక వెళ్ళి తాతను సేవించి తెలుసుకోమని వ్యాసుడు, కృష్ణుడు సలహా ఇస్తారు.

వారి సలహా వల్ల భారతంలోనే అతి పెద్ద పర్వం శాంతి పర్వం పుట్టింది. అందులో భీష్ముడు చెప్పిన విషయాలు సకల శాస్త్ర సారాలు. విష్ణుసహస్ర నామం కూడా అందులోదే. కనుక వృద్ధులను సేవించడం వలన సమాజానికి ఎం ప్రయోజనం ఉంటుందో భారతం తెలుపుతోంది‘‘ అని అన్నారు. ఆంధ్రవ్యాసుల వారి మార్గదర్శకత్వంలో మరింత లోతుగా పరిశోధన చేస్తే అద్భుతమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

1) భీష్ముడు క్రింద పడగానే వేలాది కన్యలు (నర్సుల) వచ్చి ఆప్రదేశాన్ని శుభ్రంచేసి గంధపు పొడి, పేలాలుచల్లి, పూవులతో అలంకరించారు.

2) భీష్ముడి దగ్గరకు ఎవరెవరు వచ్చారో వ్యాసుడు వివరంగా చెప్పాడు. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.
తూర్యాణి శతసంఖ్యాని తథైవ నటనర్తకాః।
శిల్పినశ్చ తథాఽఽజగ్ముః కురువృద్ధం పితామహం ॥
భీష్ముడి దగ్గరకు సంగీత వాయిద్యాలు వందల సంఖ్యలో తీసుకొని గాయకులు, నటులు, నర్తకులు, శిల్పులు (ఇంజనీరింగు విభాగంవారు) వచ్చారని వ్యాసుడు చెప్పాడు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే అంశం.

రోగి వేరు అంత్యకాలంలోని వ్యక్తి వేరు. చికిత్స ఉన్నంత కాలమే ఒక వ్యక్తి రోగి అవుతాడు. చికిత్స లేనప్పుడు అతడు పేషంటు కాడు. అతడికి చేయాల్సిన వైద్యం అంత్యకాల సేవ. అది వేరే ఉంటుంది. అదే ఆరోజున భీష్ముడికి చేశారు. అంత్యకాలంలో ఉన్న భీష్ముడికి ఆనందం కలిగించడం కోసం నటులు, నర్తకులు, గాయకులు, సంగీతకారులు వచ్చారు. నేడు కూడా ఆసుపత్రులలో సైతం టివిలు, మ్యూజిక్ సిస్టంలు ఉంచుతున్నారు. ఇక పాలియేటివ్ కేర్ సెంటర్లలో అయితే అంత్యకాలంలో వారు ఆడుకోవడానికి ఆటవస్తువులు కూడా ఉంచుతున్నారు.

ఇక్కడ అతిముఖ్యమైన అంశం ఏమిటంటే భీష్ముడి దగ్గరకు వారంతా వచ్చారు. అంతేకానీ వారు ఎవరు సంగీత వాయిద్యాలను వాయించారని కానీ, నటులు, నాట్యకారులు నాట్యం చేశారని కానీ చెప్పలేదు. దీనికి కారణం భీష్ముడు తాను మానవ భోగాలకు అతీతుడను అయ్యాను అనినందువల్ల.
అయితే వేల సంవత్సరాల క్రితం భారతంలో పాలియేటివ్ కేర్ పురుడుపోసుకుందని చెప్పడానికి ఇది రెండో అతి ముఖ్యమైన శ్లోకం భీష్మపర్వంలో ఉంది.

3) దీని తరువాత అతి ముఖ్యమైంది శాంతిపర్వంలో ఉంది. ‘‘భీష్ముడి మరణశయ్య దగ్గరకు భూమి మీదే కాక ముల్లోకాల్లో ఉన్న మహర్షులు, యతులు, పరమహంసలు, దేవతలు వచ్చారు. వారిలో నారదాది సంగీతవిద్వాంసులు ఉన్నారు. శ్రీకృష్ణుడు చూడడానికి వచ్చి భీష్ముడి బాధలు పోగొట్టగానే వ్యాస మహర్షితో కూడిన సమస్త రుషి గణాలూ రుగ్, యజుస్, సామగానాలు చేశారు. అన్ని రుతువులకు చెందిన పుష్పాలు ఏక కాలంలో కురిశాయి. దేవతలు, అప్సరసలు వచ్చి సంగీత వాయిద్యాలు మ్రోగించి గానం చేశారు. పవిత్రమైన, ప్రశాంతమైన, స్వచ్ఛమైన చల్లటి గాలి వీచింది. ఆ ప్రాంతంలో ఉన్న సమస్త జంతు పక్షిజాతి సుఖాన్ని ఆనందాన్ని అనుభవించాయి. భీష్మునికి అత్యంత ఆనందదాయకమైన వాతావరణం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుడు సూర్యాస్తమయం చూసి రేపు వస్తానని వెళ్ళాడు.‘‘

ఇక్కడ ఇచ్చిన ప్రతి వర్ణన అంత్యదశసేవల్లో చాలా ముఖ్యమైంది.
దీనిలో, రెలిజియస్ హీలింగ్, యోగా, మ్యూజిక్ థెరపీ, పుష్పవైద్యం వంటివి ఉన్నాయి.

తతస్తే వ్యాససహితాః సర్వ ఏవ మహర్షయః।
ఋగ్యజుఃసామసహితైర్వచోభిః కృష్ణమార్చయన్॥
తతః సర్వార్తవం దివ్యం పుష్పవర్షం న భస్తలాత్।
పపాత యత్ర వార్ష్ణేయః సగాంగేయః సపాండవః॥
వాదిత్రాణి చ సర్వాణి జగుశ్చాప్సరసాం గణాః।
న చాహితమనిష్టం చ కించిత్తత్ర వ్యదృశ్యత॥

అన్నిటికీ మించి పేషంటుకు ఉన్న విజిటర్స్ సమయాన్ని మహర్షులు కూడా గౌరవించి అస్తమయం అవుతుండడంతో మరలా రేపు వస్తానని కృష్ణుడు, ధర్మరాజు, భీష్ముడు వద్ద శలవు తీసుకొని వెళ్ళిపోయారు. ధర్మరాజు, కృష్ణుడు కూడా వెళ్ళిపోయారు.

4) ఇక్కడ అతి ముఖ్యమైన వర్ణన వ్యాసుడు చేస్తాడు. పాండవుల రథాలు వెళ్ళిన తీరు మహానదిని తలపించిందని చెప్పాడు.

తతో రథైః కాంచనచిత్రకూబరై
ర్మహీధరాభైః సమదైశ్చ దంతిభిః।
హయైః సుపర్ణైరివ చాశుగామిభిః
పదాతిభిశ్చాత్తశరాసనాదిభిః॥

యయౌ రథానాం పురతో హి సా చమూ
స్తథైవ పశ్చాదతిమాత్రసారిణీ।
పురశ్చ పశ్చాచ్చ యథా మహానదీ
తమృక్షవంతం గిరిమేత్య నర్మదా॥

ఈ వర్ణన చదవకపోతే తరువాత ధర్మరాజుకు ఉన్న మహత్తరమైన విజ్ఞానం మనకు అర్థం కాదు.

5) మర్నాడు ధర్మరాజు ఉదయాన్నే భీష్ముని దర్శనానికి వెళుతూ అర్జునుడిని పిలుస్తాడు. పిలిచి ఇలా అంటాడు. ‘‘ అర్జునా ఈ రోజు ఏవిధమైన మందీ మార్బలం, సైన్యం లేకుండా నేను సోదరులతో మాత్రమే వెళ్లదలచాను. మన అశ్వగజరథ సైన్య పరివారం వెళ్ళివస్తూ ఉండడం వలన అంపశయ్యమీది భీష్ముడికి ఇబ్బంది కలుగకూడదు. కనుక సైన్యాన్ని, భటులను వద్దని చెప్పు. ఈ రోజు నుంచీ నేను భీష్ముడి దగ్గర ముఖ్యమైన రహస్యాలు తెలుసుకోబోతున్నాను. కనుక అనవసరమైనవారు అక్కడ జమకూడడం నాకు ఇష్టంలేదు‘‘ అన్నాడు.

న సైనికైశ్చ యాతవ్యం యాస్యామో వయమేవ హి।
న చ పీడయితవ్యో మే భీష్మో ధర్మభృతాం వరః

ఇది నేటికీ ఆచరించదగిన ముఖ్య విషయం. ఎవరైనా గొప్ప వ్యక్తి చనిపోవడమో, జబ్బుపడడమో జరిగితే ముందుగా ట్రాఫిక్కు పోలీసుల గుండెలు ఆరిపోతాయి. వచ్చేవారు పలకరించడానికి వస్తున్నారా? లేక తమ హోదాలు వెలగబెట్టుకోవడానికి వస్తున్నారో తెలియని సందర్భాలు కోకొల్లలు. భారీగా వాహనాలు రోడ్ల మీద పార్కుచేసి ట్రాఫిక్కు స్తంభింపచేయడంతో మొదలుపెడితే గన్ మెన్లు హోషు చూపించుకోవడం, బుగ్గకార్ల హడావుడి--- ఇదంతా చూస్తే ఎంత నీచంగా ఉంటుందో ఒక సారి ఎవరికి వారు గమనించుకుంటే మంచిది.

శ్రీకృష్ణుడు కూడా శైబ్య, సుగ్రీవ, వలాహక, మేఘపుష్ప అనే తన రథాశ్వాలను శబ్దం లేకుండా వెళ్ళమని ప్రార్థించాడట. ఆ పశువులైన ఆ గుర్రాలు మహావేగంతో పయనించినా భూమి మీద అతి సుకుమారంగా వెళ్ళాయని వ్యాసుడు చెప్పాడు. నేడు ఆసుత్రుల దగ్గరకు వాహానాలలో వెళ్ళేవాళ్ళు ఆ గుర్రాలను చూసి బుద్ధి తెచ్చుకుంటే మంచిది. ఆసుపత్రి ఏరియా దయచేసి హారన్ మ్రోగించవద్దు అనే బోర్డు ఎవరూ పట్టించుకోరు. లోపల మరణావస్థలో ఉన్నపేషంట్ల వినికిడి అవయవాలు మహాబాధపెడతాయని ఎప్పటికి బుద్ధి వస్తుందో నేటి వాహన చోదకులకు?

ఆగచ్ఛత్స్వథ కృష్ణోఽపి పాండవేషు మహాత్మసు।
శైనేయసహితో ధీమాన్రథమేవాన్వపద్యత॥
రథస్థాః సంవిదం కృత్వా సుఖాం పృష్ట్వా చ శర్వరీం।
మేఘఘోషై రథవరైః ప్రయయుస్తే నరర్షభాః॥
బలాహకం మేఘపుష్పం శైబ్యం సుగ్రీవమేవచ।
దారుకశ్చోదయామాస వాసుదేవస్య వాజినః॥
తే హయా వాసుదేవస్య దారుకేణ ప్రచోదితాః।
గాం ఖురాగ్రైస్తథా రాజఁల్లిఖంతః ప్రయయుస్తదా॥
తే గ్రసంత ఇవాకాశం వేగవంతో మహాబలాః।
క్షేత్రం ధర్మస్య కృత్స్నస్య కురుక్షేత్రమవాతరన్॥

మహాభారతం నేడు కూడా ఎందుకు అనే ప్రశ్నకు ఈ శ్లోకాలు చాలు. ఎంత నిర్లజ్జగా మనం నేడు బ్రతుకుతున్నామో తెలియడానికి. వేల సంవత్సరాల క్రితం మరణశయ్యమీద వ్యక్తి దగ్గరకు ఎలా వెళ్ళాలో చెప్పిన మరో గ్రంథం ప్రపంచంలో మరొకటి లేదు. లక్షాపదివేల శ్లోకాల్లో ఏం ఉందో చదువుకుంటే మనిషిగా మనం ఎంత పశుప్రాయంతో జీవిస్తున్నామో తెలుస్తుంది. నేడు దౌర్భాగ్య ప్రభుత్వాల కారణంగా సంస్కృతం అడుగంటి భారతంలో ఏం ఉందో చదివి తెలుసుకోలేక పశువుల్లాగా బ్రతుకుతున్నాము. ఏ అమెరికా, ఇంగ్లండు వారో హాస్పీస్ సేవలు మా దగ్గరే పుట్టాయి అంటే నిజమే కాబోలు అనుకునే జాతి తయారైంది.

🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
----------------------------------------

11/06/2018

యువత రాజకీయాల్లోకి రావాలి

మిత్రులారా . . .70 ఏండ్ల స్వాతంత్ర్య భారతదేశ రాజకీయ ప్రస్థానంలో, కొవ్వొత్తుల లాగ కరిగిపోతూ దేశం కోసం, రాష్ట్రం కోసం, సమాజం కోసం మీ జీవితాలను, కుటుంబాలను, మిత్రులను, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సైతం త్యాగం చేసి, పార్టీలకు, సంఘాలకు, ఉద్యమాలకు, పోరాటాలకు ఊపిరిలూది, జెండాలు కట్టి, జేజేలు కొట్టిన యువ ఉద్యమకారులారా, మీకు వందనం!

ఒక్కసారి మన దేశ రాజకీయ చరిత్రలో యువత చేసిన త్యాగాలు, సాధించిన విజయాలను స్మరించుకుందాం.... భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రాణ త్యాగాలు చేసిన మొదటి తరం ఉద్యమ వీర స్వాతంత్ర్య సమరయోధులు మహర్షి అరబిందో, అష్ఫాకుల్లా ఖాన్, రాం ప్రసాద్ బిస్మిల్, కుదీరామ్ బోస్, చంద్ర శేఖర్ ఆజాద్, భగత్ సింగ్, రాజ్ గురూ, సుక్ దేవ్ ఇంకా ఎందరో వీరులు తమ జీవితాలని ముప్పై సంవత్సరాలు నిండక ముందే దేశం కోసం త్యాగం చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరవీరులందరూ కూడా యువతీ యువకులే. వారి త్యాగం వెలకట్టలేనిది, మన స్వేచ్ఛ కోసం, మన ప్రగతి కోసం, మన జీవితాలలో ఉన్న కష్టాలను దూరం చెయ్యడానికి వాళ్ళ సొంత జీవితాలనే త్యాగం చేసిన్రు. యువత అంటే మనం, ప్రజాస్వామిక దృక్పథంతో బ్రతుకుతాము, ప్రజలందరికీ సమాన అవకాశాలు, హక్కులు సాధించడానికి, కులాలకి, మతాలకు అతీతంగా, మనవత్వమే మన ఎజెండాగా నిస్వార్ధంగా సేవ చేస్తాము. "ప్రజాస్వామ్యమంటే మనకు కేవలం ఒక రాజకీయ ప్రక్రియ కాదు, అది ఒక సామాజిక ప్రక్రియ, అది మన నైతిక విలువ, అది మన జీవన విధానం." మనము సమాజంలో మార్పును తీసుకురావడానికి పని చేస్తున్నాము, అంటే సమాజంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తున్నాము, సమస్యల పరిష్కారానికి రాజకీయ రంగ ప్రవేశం తప్పదు, ఎందుకంటే మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. మన రాజకీయ లక్ష్యం ఒక్కటే, యువత రాజ్యాధికారం ద్వారా ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అభివృద్ధి జరగాలి, ఆ ప్రగతికి యువత అన్ని స్థాయిల్లో ప్రజలకు జవాబుదారీ గా ఉండాలి, రాజకీయ నిర్ణయాధికారం సాధించుకోవాలి.

రాజకీయాలంటే కేవలం డబ్బు, పైరవీలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, కాంట్రాక్టులు అనే ఒక తప్పుడు అవగాహన సమాజంలో ఉంది, కానీ అది కొంత మంది మాత్రమే చర్చించే స్థాయిలో ఉన్నది, నిస్వార్థ యువతీయువకులు రాజకీయ రంగ ప్రవేశం చెయ్యకపోతే ఎక్కువ మంది ప్రజలు అలా ఆలోచించే లాగ ప్రోత్సహించిన వాళ్ళమవుతాము. రాజకీయాలను ప్రక్షాళన చెయ్యాల్సిన భాద్యత మనదే! దేశాన్ని, రాష్ట్రాన్ని సాధించిన యువత చెయ్యకపోతే ఇంకెవ్వరు చేస్తారు? రాజకీయ ప్రక్షాళన!

మన ఇంట్లో, మన బంధువులు, మన మిత్రులు వాళ్ళకి ఉన్న అవగాహనతో, భయాలతో మనల్ని రాజకీయాలు వద్దు అని చెపుతారు, అక్రమంగా దాడులు చేస్తారని, కుట్ర కేసులు పెడతారని వాళ్ళ భయం, అది సహజమైన భయమే, మనం మార్చల్సింది అదే భయాన్ని, మనకి సమస్యలే శత్రువులు, వ్యక్తిగత వైరుధ్యాలతో మన సమయాన్ని వృధా చేసుకోకుండా పని చేద్దాము. పార్టీలకు, రాద్ధాంతాలు, సిద్ధాంతాలకు అతీతంగా సమాజం మంచి కోరి రాజకీయాల్లోకి రావలనుకునే వారికోసం దారులు వేద్దాం. యువ వార్డు మెంబర్లు, యువ సర్పంచులు, యువ ఎంపీటీసీలు, యువ కౌన్సిలర్లను గెలిపించుకుందాం, యువ నాయకులు, యువ కార్యకర్తలను తయారు చేద్దాం, పల్లెటూరు నుండి పార్లమెంటు దాకా యువతను గెలిపించుకుందాం. రాజకీయాలను ప్రజలకు చేరువ చేద్దాం, రాజకీయ నాయకులు ప్రజలకు సేవకులుగా ఉండేలా మార్పు తెద్దాం! సమాజం మీద ప్రేమ, ప్రజలందరి హక్కుల కోసం పని చెయ్యాలని భాద్యత ఉన్నవాడే నాయకుడు అవుతాడు. కులాలు, మతాలు అనే చర్చ మనల్ని అడ్డుకోవడానికి పన్నిన కుట్రగా భావించాలి. ఆలోచనలకు పదును పెట్టండి. ఆచరణకు సిద్ధం కండి.

ఇంతకు ముందెన్నడూ లేని విధంగా గ్రామ స్థాయి నుండే రాజకీయ ప్రక్షాళన అనే లక్ష్యం తో మొదటి అడుగు వేసిన తెలంగాణ జన సమితి పార్టీ, తమ గ్రామాల్లో మార్పు కోసం సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి ఉన్న యువకులని ప్రోత్సహిస్తోంది

అందులో భాగంగా ప్రతీ గ్రామం నుండి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి అప్లికేషన్స్ స్వీకరించటం మొదలు పెట్టిన వెంటనే యువత నుండి అనూహ్య స్పందన వచ్చింది. వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అప్లై చేసుకున్న యువతీ యువకులకు అవగాహన సదస్సును కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు దరఖాస్తు చేసుకోబోయే యువతీ యువకులకు కూడా త్వరలో అవగాహన సదస్సులను నిర్వహించటానికి తెలంగాణ జన సమితి పార్టీ సన్నద్ధం అవుతుంది.
ఐతే ఆ అప్లికేషన్ సదుపాయాన్ని Online లో కల్పించటం వల్ల యువకులు చాలా తేలికగా పార్టీ వెబ్ సైట్ లోకి వెళ్లి, అందులో అప్లికేషన్ Fill Up చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది

10/06/2018

#అతీతలోకాలు - #అదృశ్యశక్తులు

* చాలామంది అతీతలోకాలు లేవని అనుకుంటారు. అదృశ్యశక్తులు కూడా లేవని అనుకుంటారు. అది నిజం కాదు. అవి ఉన్నాయి. మనకు కనిపించనంత మాత్రాన "లేదు" అనుకోవడం వెర్రితనం. రాత్రిళ్ళు మనకు సూర్యుడు కనిపించడు.అంతమాత్రాన సూర్యుడే లేడు అనుకోవడం ఎంత తెలివితక్కువతనమో ఇదీ అంతే. రాత్రి మాత్రమె తెలిసినవాడు సూర్యుడు లేడు అనుకోవచ్చు. కాని పగటిని చూచినవాన్ని అడిగితే సూర్యుడున్నాడు అని అతను చెప్తాడు. అలాగే, మనకు కనిపిస్తున్నదే సత్యమనీ తక్కినది అబద్దమనీ అనుకోవడం పిచ్చితనం. గోడ అవతల ఏముందో మనం చూడలేం. అంతమాత్రాన గోడ అవతల ఏమీ లేదు అనుకోవడం తప్పే కదా.

మనిషి ఇంద్రియాలకున్న పరిధి అతి స్వల్పమైనది. మన మెదడులోనూ ఊపిరితిత్తులలోనూ ఉన్న శక్తిలో మనం నిత్యజీవితంలో వాడుకునేది చాలా స్వల్పం. సాధారణ మానవులలో పినియల్ గ్లాండూ, పిట్యూటరీ గ్లాండూ చాలావరకూ నిద్రాణంగా పడి ఉంటాయి.అలాగే మన పొటెన్షియల్ శక్తిలో ఎంతో భాగం నిరుపయోగంగా పడిఉంది. లేదా వృధాగా పోతూ ఉంటుంది. యోగులు ఆ మొత్తాన్నీ నిగ్రహించి దానిని సరియైన వాడుకలోనికి తెస్తారు. అందువల్ల వారి ఇంద్రియాల పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది. వారి దర్శనశక్తి కూడా అమితంగా వృద్ధి చెంది ఉంటుంది. అందుకే మామూలు మనుషులు చూడలేనివి వారు చూస్తారు. ఇతరులు వినలేనివి వారు వినగలరు. ఆ క్రమంలోనే అతీతలోకాలను వారు చూడగలుగుతారు. అదృశ్య శక్తులతో సంభాషించగలుగుతారు.

మనిషి చూడలేని వేవ్ లెంగ్త్ లను కొన్ని జంతువులు చూడగలవు. కుక్కలకు ఆ శక్తి ఉంది. అవి ఒక్కొక్కసారి దయ్యాలను చూచి ఏడుస్తూ ఉంటాయి. అయితే కుక్క ఏడ్చిన ప్రతిసారీ అక్కడేదో దయ్యం ఉన్నట్లు అనుకోవడం కూడా తప్పే. దానికి ఆకలేసినా, సీజన్ వచ్చినా కూడా అలాగే ఏడుస్తుంది. ప్రేతాత్మలను చూచినప్పుడు కుక్క ఏడవటం ఒక తీరులో ఉంటుంది. అనుభవంలో దానిని కనిపెట్టవచ్చు. గబ్బిలాలు సూక్ష్మ తరంగాల ఆధారంగానే దేనికీ తగలకుండా ఎగరగలుగుతాయి. పక్షులు తమలోని అయస్కాంత దిక్సూచి ఆధారంగానే వేలమైళ్ళు ప్రయానంచేసినా మళ్లీ తమ గూటికి చేరుకోగలుగుతాయి. పిల్లులు కూడా మనం చూడలేని వేవ్ లెంగ్త్ లో ఉన్న జీవులను చూడగలవు. పాములు ఈ విషయంలో మరీ శక్తివంతమైన జీవులు. మైళ్ళ దూరంలో ఉన్న మనిషి కదలికలను అవి గుర్తుపట్టగలవు. కొన్ని దేవతా సర్పాలకైతే అతీత శక్తులు ఉంటాయి. అవి మానవరూపం ధరించగలవు. మానవ భాషలో మాట్లాడగలవు కూడా.

నిద్రాణంగా ఉన్న మన ఇంద్రియశక్తులను యోగం ద్వారా నిద్రలేపినపుడు అద్భుతాలు చూడవచ్చు. ఇంతవరకూ మనం చూస్తున్న లోకం వెనుక ఎన్ని లోకాలున్నాయో గమనించవచ్చు. వాటిలో ఎన్నెన్ని జీవులున్నాయో చూడవచ్చు. వారితో ఇంటరాక్ట్ కావచ్చు. కొందరు పాశ్చాత్య శాస్త్రజ్ఞులు చెప్పినదాని ప్రకారం మనం చూస్తున్న డైమెన్షన్ వెనుక కనీసం ఆరు ఇతర డైమెన్షన్ లు ఉన్నాయి. అంటే మొత్తం ఏడు లోకాలున్నాయి అని అర్ధం. మన ప్రాచీనులు చెప్పిన భువర్లోక సువర్లోకాది సప్త ఊర్ధ్వలోకాలు అవే. వీటికి నెగటివ్ పోల్స్ నే అతల వితలాది సప్త అధోలోకాలు అన్నారు.

ఒక్కొక్క డైమెన్షన్ లో ఒక్కొక్క రకమైన జీవులు ఉంటాయి. మళ్లీ వీటిలో విభిన్న తరగతుల వాళ్ళు ఉంటారు. మానవలోకంలో అందరూ మానవులే అయినప్పటికీ వాళ్ళలో మళ్లీ తేడాలున్నట్లుగా అక్కడ కూడా ఉంటుంది.వీరిలో కొందరు ఉన్నత స్థాయికి చెందిన జీవులు వారి ఇష్టానుసారం మనకు కనిపించి సూచనలు ఇవ్వగలవు. మన కర్మలో పాలుపంచుకోగలవు. సద్గురువులకు ఈ శక్తి ప్రస్ఫుటంగా ఉంటుంది. తమ శిష్యులను జన్మజన్మాన్తరాలవరకూ వారు గైడ్ చెయ్యగలరు.

మనం ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు, యోగసాధనా బలం తగినంత ఉన్నపుడు, సద్గురువులతో మనం కోరినప్పుడు సంభాషించవచ్చు. ఊర్ధ్వలోకాలలో ఉండే ఉత్తమ జీవులను దేవతలు అంటాము. వారు కాంతి శరీరాలను కలిగి ఉంటారు. అవి రకరకాల రంగులలో ఉంటాయి. ఆయా రంగులు వారి తత్వాన్నీ శక్తులనూ ప్రతిబింబిస్తూ ఉంటాయి. దేవతలనబడే ఈ ఉత్తమ జీవులను చూచి వారితో సంభాశించగలిగే శక్తి కొందరికి ఉంటుంది. శ్రీరామకృష్ణుల శిష్యుడైన బ్రహ్మానందస్వామికి ఈ శక్తి ఉండేది. ఆయన దేవతలను చూచి వారితో మాట్లాడగలిగేవారు. రాత్రిళ్ళు మూసి ఉన్న ఆయన గదితలుపుల వెనుక నుంచి రకరకాల కాంతులు బయటికి ప్రసరిస్తూ ఉండేవి. ఖాళీగా నిరాడంబరంగా ఉండే ఆయన గదినుంచి రకరకాల వాయిద్యాల ధ్వనులు ఒక్కొక్కసారి బయటికి వినవచ్చేవి. రకరకాల సువాసనలు అకస్మాత్తుగా ఆ గదినుంచి గుప్పుమనేవి.

ఇవన్నీ కూడా వినడానికి "ఫెయిరీ టేల్స్" లా ఉండవచ్చు. కానీ ఆ కధలవేనుక ఉన్న ప్రేరణకూడా కొన్ని వాస్తవాలమీద ఆధారపడినట్టిదే అని మరువరాదు. అతీతలోకాల దర్శనాన్ని పొందినవారు అన్నికాలాలలోనూ అన్నిదేశాలలోనూ ఉన్నారు. వారు చెప్పిన వివరాలనుంచి ఈ కధలు (fairy tales) పుట్టుకొచ్చాయి. అయితే ఈ అతీతశక్తులను పొందటం ఎలా అనేది ఒక సైన్స్ గా క్రోదీకరించబడినది మాత్రం మన దేశంలోనే.మన యోగులు మహర్షులు ఈ సైన్స్ కు సృష్టికర్తలు. ఇది ఇప్పటికీ సజీవంగా ఉన్న రహస్యవిద్య. అర్హత ఉన్నవారిని ఈ రంగంలో ఇప్పటికీ సద్గురువులు గైడ్ చేస్తూనే ఉంటారు. వారి కమ్యూనికేషన్ విధానాలు కూడా విచిత్రంగా ఉంటాయి. అదొక రహస్య ప్రపంచం అని చెప్పవచ్చు. బయటి వారికి దీనివివరాలు అస్సలు తెలియవు.

నిత్యజీవితంలో కూడా మనకు కొన్నికొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొంచం సెన్సిటివ్ గా ఉన్నవారికి ఇవి అనుభవం లోనే ఉంటాయి. ఉదాహరణకు, ఈరోజు ఒక స్నేహితున్ని చూస్తామేమో అనిపిస్తుంది. అదేరోజు అతను అనుకోకుండా ఊడిపడతాడు. అనుకోకుండా పని పడి వచ్చాను, సరే ఊళ్లోకి వచ్చాను కదాని నిన్ను కలిసిపోదామని వచ్చాను అంటాడు. ఒక ఫోన్ కాల్ వస్తుందని అనిపించిన కొద్ది నిముషాల లోనే ఆ కాల్ రావడం ఎన్నో సార్లు జరుగుతుంది. అలాగే ఈరోజు ఏదో చెడువార్త వింటాం అనిపిస్తుంది. మధ్యాన్నానికి ఎవరో పోయారనో,లేదా ఇంకేదో అయిందనో వార్త వింటాము. లేదా కలలో ఒక వ్యక్తీ కనపడి మూగగా చూస్తూ మాయం అవుతాడు. తర్వాత కొన్నాళ్ళకు అతను చనిపోయాడని వార్త వింటాము. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. మనుషుల మధ్య కంటికి కనిపించని బందాలుంటాయి. సరియైన రాపోర్ట్ ఉన్నప్పుడు అమెరికాలో ఉన్న వ్యక్తికి జ్వరం వస్తే మనకు ఇక్కడ తెలిసిపోతుంది. ఈ స్పందనకు కాలంతో దూరంతో పని ఉండదు. ఇది ఒక మాగ్నెటిక్ రేసోనేన్స్ లాగా పనిచేస్తుంది.

నిత్యజీవితంలో జరిగే ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తాను. చిన్నపిల్లల తల్లికి ఇవి బాగా అనుభవంలో ఉంటాయి. బిడ్డకు నలతగా ఉంటే తల్లికి వెంటనే తెలిసిపోతుంది. అలాగే తల్లి తమ మీదనుంచి దృష్టి తిప్పి వేరే విషయం మీద దృష్టి పెడితే బిడ్డ నిద్రపోతున్నా కూడా వెంటనే మేలుకొని ఏడవడం మొదలుపెడుతుంది. అబ్బబ్బ ఒక్క పని కూడా చేసుకోనివ్వడు. ఎటూ కదలనివ్వడు వీడికేలా తెలుస్తుందో అని విసుక్కునే తల్లులు లక్షల సంఖ్యలో ఉంటారు. ఇవన్నీ కూడా ఈ రేసోనేన్స్ వల్లనే జరుగుతాయి. ప్రేమికుల మధ్యన కూడా ఇలాంటి రేసోనేన్స్ ఉంటుంది. ఒకరికి ఏదైనా బాధ కలిగితే వెంటనే రెండో వారికి ఎందుకో తెలీని బాధ కలుగుతుంది. కానీ కారణం మాత్రం వారికి తెలియదు. ఇలాంటి రేసోనేన్స్ అనేది తల్లీ పిల్లలు కావచ్చు, ప్రాణ స్నేహితులు కావచ్చు, ప్రేయసీ ప్రియులు కావచ్చు, గురుశిష్యులు కావచ్చు వీరిలో ఎవరి మధ్యనైనా ఉండవచ్చు. దీనిలో ముఖ్యంగా ఉండవలసింది ఏకమనస్కత. అంటే ఒకే వేవ్ లెంగ్త్ లో వారిద్దరూ ఉండాలి. అలాంటప్పుడు కాలంతో దూరంతో సంబంధం లేకుండా ఇది ఏర్పడుతుంది. ఇది చాలామంది మామూలు మనుషులకు కూడా అనుభవంలో ఉండే విషయం. అయితే ఈ శక్తి వారి అదుపులో ఉండదు. కావలసినప్పుడల్లా దీనిని వారు ఫీల్ అవలేరు.

ఈ శక్తినే యోగం ద్వారా విపరీతంగా వృద్ధి చేసుకోవచ్చు. అప్పుడు అది వారి స్వాధీనం అవుతుంది. సంకల్ప శక్తితో మనస్సును ఫ్లడ్ లైట్ లా కేంద్రీకరించగలిగితే ఆ లైట్ పడిన చోట ఏముందో స్పష్టంగా కనిపిస్తుంది. పతంజలి మహర్షి ఈ శక్తుల గురించి తన యోగసూత్రాలలోని "విభూతిపాదం"(Chapter on Powers) అనే అధ్యాయంలో చెప్పారు. ఏ ఏ విషయాల పైన సంయమం చేస్తే యోగిలో ఏఏ శక్తులు ఎలా వృద్ధి చెందుతాయో అందులో వివరించారు.

ఉదాహరణకు మహర్షి ఒకచోట ఈ సూత్రాన్ని ఇచ్చారు "సమాన జయాత్ ప్రజ్వలనం". శరీరంలో ఉన్న సమానవాయువు అనేదాన్ని అదుపులోనికి తెచ్చుకుంటే యోగి తన శరీరం నుంచి జ్వలించే కాంతిని వెదజల్లగలడు. దీనిని సాధించిన యోగులు చాలామంది నేటికీ ఉన్నారు. ఈ విషయాన్ని గురించి నేనొకసారి మాట్లాడుతున్నపుడు నా స్నేహితుడొకడు ఒప్పుకోలేదు. "ప్రకృతిలో సాధ్యం కాని విషయాలను ఏదో పుస్తకంలో రాసినంత మాత్రాన ఎలా నమ్మాలి?" అని వాదించాడు. అతనితో ఇలా చెప్పాను. "ప్రకృతిలో లేవని నీవు ఎలా అనుకుంటున్నావు? ఉన్నాయి. చూచే దృష్టి నీకు లేదు. నీకు తెలియనంత మాత్రాన ప్రకృతిలోనే ఇవి లేవు అని ఎలా నిర్ధారణకు వస్తున్నావు? మిణుగురు పురుగును చూచావుకదా. రాత్రిపూట అది తనలోనుంచి కాంతిని ఎలా వెదజల్లుతుంది? అలాంటి శక్తి ఈ టెక్నిక్ వల్ల మనిషికి కూడా వస్తుంది." అని చెప్పాను. అతను మళ్లీ మాట్లాడలేదు.

అలాగే "కంటకూపే క్షుత్పిపాసా నివృత్తి:" అనేది ఇంకొక సూత్రం. తన గొంతులో ఉన్న విశుద్ధ చక్రంమీద సంయమం చెయ్యగలిగిన యోగి ఆకలి దప్పులచేత పీడింపబడడు అనేది దీని అర్ధం. ఇది కూడా చాలామంది యోగులకు అనుభవైక వేద్యమే. ఆహారం దొరకని హిమాలయ సానువుల్లో రోజుల తరబడి ధ్యానసమాధిలో ఉండే యోగులు ఈ టెక్నిక్ ద్వారానే ఆకలిదప్పులకు అతీతులుగా ఉండగలుగుతారు.

మనం చూస్తున్న లోకం వెనుకే, మనం చూడలేని లోకం ఒకటుంది. ఆ లోకం, మనం చూస్తున్న లోకంకంటే అనేక వేలరెట్లు పెద్దదీ, విభిన్నమైనదీ, అనేక రంగులతో కూడినదీ. మనిషి ఒక చిన్న బురదగుంతలో బతుకుతున్న ఛిరుకప్ప లాంటివాడు. ఈ గుంతనే అతను గొప్ప ప్రపంచం అనుకొని, అందులో సాధ్యమైనంత దోచుకొని దాచుకోవడానికి రకరకాల మోసాలు చేస్తూ నీచమైన బతుకు బతుకుతున్నాడు. అతీతలోకాలను ఒక్కసారి దర్శిస్తే మన బ్రతుకు ఎంత అల్పమైనదో ఎంత నీచమైనదో అర్ధమౌతుంది. అప్పుడు మన జీవితం మీద మనకే అసహ్యం కలుగుతుంది. ఉన్నతజీవితం మీద అభిలాష తీవ్రమౌతుంది.

ఒక ఉపన్యాసంలో వివేకానందస్వామి ఇలా అంటారు. "ఏమీ చూడని వానికంటే ఒక దెయ్యాన్ని చూచినవాడైనా ఉత్తముడే. ఎందుకంటే మనం చూడని ఇంకొక లోకం ఉందన్న సత్యం అతనికి అలాగైనా అర్ధమౌతుంది." తద్వారా అంతరిక జీవితం మీద అతనికి ఆసక్తి మొదలౌతుంది.క్రమేనా అదే అతన్ని ఉన్నత స్థాయిలకు చేర్చే అవకాశం ఉంది.

మనం చూస్తున్న ఈలోకం వెనుక, ఎన్నో లోకాలున్న మాట వాస్తవం. వాటిలో మన స్థాయికి మించిన అనేకరకాల జీవులున్న మాట కూడా వాస్తవమే. సరైన ట్రెయినింగ్ తో ఆలోకాలను చూడవచ్చు . ఆ జీవులతో సంభాషించవచ్చు. మనం నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం.

04/06/2018

జీవావిర్భావం -
*****************************

జీవం ఎలా పుట్టింది? ఇది సైన్స్ కి ఈనాటికీ అంతుపట్టని ఒక మిస్టరీ. పదార్ధం నుండి కాలం గడిచే కొద్దీ కాకతాళీయంగా జీవ పదార్ధం ఏర్పడి ఉండచ్చని, ఆ తర్వాత క్రమ పరిణామం ద్వారా సంక్లిష్టమైన జీవ జాతులు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తల అంచనా.

నిర్జీవ పదార్ధం నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు జీవం పుడుతుందని చెప్పే సిద్ధాంతాన్ని 'అబియో జెనెసిస్' అంటారు. కానీ ఈ సిద్ధాంతానికి ఇప్పటి వరకూ ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ దొరకలేదు. ప్రస్తుతానికి ఇది ఒక ఊహా సిద్ధాంతం మాత్రమే. ప్రయోగశాలల్లో ఇంత వరకూ శాస్త్రవేత్తలు ఒక్క జీవకణాన్ని కూడా సృష్టించలేక పోయారు.

2015 అక్టోబర్ లో లాస్ ఏంజిల్స్ కు చెందిన కాలిఫోర్నియా యూనివర్శిటీ పరిశోధకులు భూమి మీద జీవం 410 కోట్ల సంవత్సరాల క్రితమే ఆవిర్భవించిందని ప్రకటించారు. ఇది గతంలో ఊహించినదాని కంటే 30 కోట్ల సంవత్సరాల ముందు కాలం. 454 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడిన కొద్ది కాలానికే, అంటే సుమారు 44 కోట్ల సంవత్సరాల తర్వాత జీవం ఆవిర్భవించిందని ఈ శాస్త్రవేత్తల బృందం తెలిపింది.

పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతంలో అభించిన మాగ్మా శిలల నుండి ఏర్పడిన 10,000 లకు పైగా 'జిర్కాన్' లనే పదార్ధాలను అధ్యయనం చేయడం ద్వారా భూరసాయన శాస్త్రవేత్తలు ఈ అంశాలను నిర్ధారించారు.

భూమి ఏర్పడిన తొలినాళ్ళలో దాదాపు ఇప్పుడు ఉన్నట్లుగానే ఉండేదని ఈ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి ఏర్పడిన తొలినాళ్ళలో భూమి ఒక మరుగుతున్న గ్రహమని చెప్పడానికి ఎలాంటి ఆధారాలూ లేవని వీరు తెలిపారు. భూమి ఏర్పడిన తర్వాత సరైన అనుఘటకాలు ఉండడం వల్ల జీవం త్వరగానే ఆవిర్భవించిందని వీరు తెలిపారు.

ఇప్పటి వరకూ శాస్త్రవేత్తలు భూమి ఏర్పడిన తొలినాళ్ళలో భూమి మీద మీథేన్, అమ్మోనియా, నీటి ఆవిరి, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి వాటితో కూడిన, జీవం పుట్టుకకు అనుకూలం కాని క్షయకరమైన వాతావరణం ఉండేదని, ఆక్సిజన్ తక్కువగా ఉండేదని, వేడిగా ఉండే సంక్లిష్ట వాతావరణం ఉండేదని, ఇప్పటి భూవాతావరణానికి పూర్తిగా భిన్నమైన వాతావరణం ఉండేదని భావిస్తున్నారు.

అలాంటి వాతావరణంలో అతినీలలోహిత కిరణాలు, ధార్మిక శక్తి మొదలైన వాటి ప్రభావం వల్ల అమైనో ఆమ్లాలు వంటి పదార్ధాలు ఏర్పడ్డాయనీ, వీటినుండి కాలక్రమేణా జీవ పదార్ధంలో ముఖ్యాంశాలైన పదార్ధాలు ఏర్పడి చివరకు జీవ పదార్ధం ఏర్పడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

కానీ, భూమి ఏర్పడిన తొలినాళ్ళలో ఉన్న పరిస్థితుల పట్ల ఇప్పటివరకూ శాస్త్రవేత్తలకున్న భావనలకు సరైన ఆధారాలు లేవని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞుల బృందం నిరూపించింది.

జీవ పదార్ధం ఎంతో క్లిష్టము, సంకీర్ణమూ అయిన నిర్మాణాన్ని కలిగి ఉంది. అందువల్ల అలాంటి జీవ పదార్ధం ఏర్పడాలంటే, దానికి కారణభూతమైన ఆరంభదశ యొక్క లక్షణాలు కూడా ఎంతో క్లిష్టము, సంకీర్ణమూ అయి ఉండాలి. మరి అప్పుడు అలాంటి పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయి ? అనే ప్రశ్న ఉదయిస్తుంది.

దాని ఆరంభ దశ కూడా అలాంటి సంకీర్ణ స్థితినే కలిగి ఉండాలి. అంటే జీవజాతులన్నీ ఏర్పడడానికి కావాల్సిన సంకీర్ణ వ్యవస్థ అనాదిగా ప్రకృతిలో ఎల్లప్పుడూ ఉండి తీరాల్సి ఉంటుంది. అప్పుడు క్రమ పరిణామమనే భావనకే అర్ధం లేకుండా పోతుంది.

కానీ కాలిఫోర్నియా యూనివర్శిటీ పరిశోధకులు ఆరంభదశలో భూమి దాదాపు ఇప్పుడు ఉన్నట్లు గానే ఉండేదని నిరూపిస్తున్నారు. మరి ఇలాంటి భూవాతావరణంలో సంక్లిష్టమైన జీవ పదార్ధం ఎలా ఏర్పడిందో శాస్త్రవేత్తలకు అంతు పట్టట్లేదు.

జీవ కణం యొక్క కేంద్రకంలో ఉండే డి.ఎన్.ఏ. అణువులో జీవ సమాచారమంతా కలిగిన 300 కోట్ల విభాగాలు కలిగిన కోడింగ్ వ్యవస్థ ఉంటుంది. 1953 లో జేమ్స్ వాట్సన్ మరియు ఫ్రాన్సిస్ క్రిక్ లు డి.ఎన్.ఏ. నిర్మాణాన్ని కనుగొన్నారు.

ఫ్రాన్సిస్ క్రిక్ ఇలా అంటారు : “ఇంతటి సంక్లిష్ట నిర్మాణం గల జీవ కణం క్రమ పరిణామం ద్వారా కాకతాళీయంగా పుట్టి ఉండదు. ఇప్పటివరకూ ఉన్న విజ్ఞానం సహాయంతో నిజాయితీ గల మనిషిగా చెప్పాలంటే జీవావిర్భావం అనేది ఒక అద్భుతం (మిరాకిల్).”

జేమ్స్ వాట్సన్ ఇలా అంటారు : " నీరు, గ్లూకోజ్ వంటి పదార్ధాల యొక్క అణువులను అర్ధం ఛేసుకున్నంతగా జీవ కణం యొక్క నిర్మాణాన్ని అర్ధం చేసుకోవడం ఎన్నటికీ సాధ్యం కాదని అంగీకరించక తప్పదు."

జీవకణంలో ఒక భాగమైన మైటోకాండ్రియాను కూడా ప్రయోగశాలలో శాస్త్రవేత్తలు ఇంతవరకూ తయారు చేయలేకపోయారు. ఒకవేళ భవిష్యత్తులో శాస్త్రవేత్తలు టెస్ట్ ట్యూబ్ లో జీవాన్ని సృష్టించగలిగినా, అది కాకతాళీయంగా ఏర్పడినట్లు కాదు. ఒక మేథస్సు గల జీవి అయిన మానవుడి చేత నిర్మించబడిందే అవుతుంది.

బ్రిటన్ కి చెందిన ప్రఖ్యాత గణిత - భౌతిక శాస్త్రవేత్త రోజర్ పెన్ రోజ్, జీవం ఏర్పడడానికి అవకాశం గల విశ్వం ఏర్పడడానికి ఎంత వరకూ అవకాశం ఉందో సంభావ్యత ( ప్రాబబిలిటీ ) ద్వారా లెక్కలు వేశాడు. దాని ప్రకారం ఒకటిని టెన్ టూ ది పవర్ ఆఫ్ టెన్ టూ ది పవర్ ఆఫ్ 123 చేత భాగిస్తే వచ్చే సంఖ్య ఎంతో అదే ఆ సంభావ్యత. అంటే దానిని సున్నా కింద లెక్క వేసుకోవచ్చు. కాబట్టి జీవం ఏర్పడడానికి అవకాశం ఉన్న విశ్వం ఏర్పడే అవకాశమే లేదు. 'చైతన్యం' లేక 'ఎరుక' గల ఒకానొక అతీత శక్తి వల్లే జీవం ఏర్పడి ఉండాలి.

దీనికన్నా ముందే డి.సింగ్ మరియు థామ్సన్ అనే గణిత శాస్త్రవేత్తలు ఒక జీవ కణం దానంతటదే ఏర్పడాలంటే ఎంతకాలం పడుతుందో లెక్కలు వేశారు. వీరి లెక్కల ప్రకారం 4.5 బిలియన్ సంవత్సరాలని 64 టూ ది పవర్ ఆఫ్ 80,000 చేత హెచ్చిస్తే ఎంత వస్తుందో అంత కాలానికి ఒక్క జీవ కణం ఏర్పడే అవకాశం ఉంది.. అంత కాలం లోపు ఈ సౌర కుటుంబం నశించి పోతుంది. అంటే ఒక్క జీవ కణం ఏర్పడడానికి కూడా అవకాశం లేదు.

కాబట్టి కాలగతిలో కాకతాళీయంగా జీవకణాలు వాటంతట అవే ఏర్పడే అవకాశం లేదు. మనకు అంతు పట్టని వేరొక శక్తేదో అందుకు కారణమై ఉండాలి. అయినప్పటికీ పాఠ్య గ్రంథాల ద్వారా విద్యార్ధినీ విద్యార్ధులకు అలాగే బోధించడం మౌఢ్యం. శాస్త్రజ్ఞులలో నిజాయితీ లోపించి విజ్ఞానం పేరిట అసత్య భావాలను ప్రచారం చేసి యువకుల మనస్సులను సత్యాన్వేషణ నుండి ప్రక్క దారి పట్టిస్తున్నారంటారు సింగ్ మరియు థామ్సన్.

ఒక జీవ కణంలో యల్ - త్రియోనైన్, యల్ - ఐసోల్యూసైన్ అనే పదార్ధాలు సంశ్లేషించబడడం వల్ల ఏర్పడాల్సిన పదార్ధాన్ని ఆ జీవ కణంలోకి కృత్రిమంగా ప్రవేశపెడితే ఆ సంశ్లేషణ ప్రక్రియ వెంటనే నిలిచి పోయి ఆ పదార్థాలు ఎక్కువ కాకుండా ఆ జీవ కణం చూసుకుంటుంది. అణుస్థాయిలో జరిగే ఇలాంటి సచేతన క్రియలకు కారణమేంటి? వాటిని వివరించగలిగే రసాయనిక సూత్రాలేమిటి? ఈ ప్రశ్నలకు సైన్స్ దగ్గర సమాధానాలు లేవు.

డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం "సహజ ఎన్నిక" లేదా "ప్రకృతి సిద్ధమైన ఎన్నిక" ద్వారా పరిణామ క్రమంలో అంతకంతకూ సంకీర్ణమైన జీవ జాతులు ఏర్పడ్డాయి.

ఈ క్రమ పరిణామంలో మేలైన జీవజాతి లక్షణాలు ( అంటే జీవులకు ఉపయోగపడే ఉత్పరిణామాలు) కొనసాగుతాయని, జీవులకు ఉపయోగపడనివి నశిస్తాయని ఈ సిద్దాంతం చెబుతుంది. కానీ ఇలా తరతరాలుగా జరగాలంటే అలా నిర్దేశించే లక్ష్యపరమైన శక్తి (అంటే సచేతనమైన శక్తి) ఉండాలి. క్రమ పరిణామం కేవలం కాకతాళీయం మాత్రమేనంటే అలాంటి ఉపయోగపడే రూపాలతో పాటు, ఉపయోగపడనివి కూడా నిలిచి ఉండాలి. కానీ ప్రకృతిలో ఉపయోగ పడని జీవ రూపాలు అంతమొందుతాయి.

విశ్వంలో ఒక్క జీవకణమైనా ఏర్పడాలంటే, అలాంటి లక్ష్యం వైపు పదార్ధాన్ని పనిచేయించే చైతన్యం ఒకటి ఉండి ఉండాలి. జీవులలో కోట్ల సంవత్సరాల పాటు ఈ క్రమపరిణామం జరిగి మానవుడు ఉద్భవించాలన్నా దానిని ఆ దిశగా పయనింపచేసే 'చైతన్యం' లేక 'ఎరుక' అవసరం.

ఇలాంటి చైతన్యం పదార్ధానికే ఉందని భావిస్తే, అప్పుడు జీవం లేని జడ పదార్ధం నుండి చైతన్యం ఏర్పడిందని చెప్పడం సాధ్యం కాదు. చైతన్యము, పదార్ధము ఒకే మూలతత్వం యొక్క రెండు అంశాలని చెప్పాల్సి ఉంటుంది. క్వాంటం సిద్ధాంతం ప్రకారం పరమాణువుల్లోని అంశాలు కణాలుగాను, తరంగాలుగానూ ప్రవర్తించినట్లు ఈ విశ్వానికి ఆధారమైన తత్వం పదార్ధమే కాక చైతన్యం కూడానని చెప్పాల్సి ఉంటుంది.

అంటే మన ప్రాచీన ఆత్మవేత్తలు చెప్పిన " ప్రకృతి - పురుషుడు" అన్న భావననే మనం తిరిగి ఆధునిక సైన్స్ పరిభాషలో చెబుతున్నామన్న మాట. ఇక్కడే భగవద్గీత ఏం చెబుతోందో కొద్దిగా గుర్తు చేసుకుందాం.

"భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము - ఈ ఎనిమిదీ కలిసి భిన్నమైన నా భౌతిక శక్తి (అపరా ప్రకృతి - మాయా శక్తి) యొక్క రూపాలు." ( 7 - 4 )
"మహా బాహుడవైన ఓ అర్జునా! ఇవి కాక జీవ రూపమై ఈ జగత్తునంతటినీ ధరిస్తున్న నా మరో ప్రకృతి (ఉన్నత ప్రకృతి - పురుషతత్వం) ఇంకొకటి ఉందని తెలుసుకో." ( 7 – 5 )
"భౌతిక ప్రకృతి, పురుషుడు (జీవం) - రెండూ అనాది అని తెలుసుకోవాలి. సకల పరివర్తనములు, భౌతిక గుణములు భౌతిక ప్రకృతి నుండి పుట్టినవి." ( 13 – 20 )
"సృజించబడిన సర్వభూతములకు ఈ రెండు ప్రకృతులే కారణములై ఉన్నవి. సమస్త జగత్తుకు మూల కారణము, ప్రళయము రెండూ నేనే." ( 7 -6)

అంటే, భౌతిక ప్రకృతి (అపరా ప్రకృతి - పదార్ధము), సకల జీవుల రూపంలో ఉండే చైతన్యము ( ఉన్నత ప్రకృతి - పురుషుడు) - ఇవి ఒకే మూలతత్వమైన భగవంతుని యొక్క రెండు అంశాలు అని భగవద్గీత చెబుతుంది.

అట్టి చైతన్య శక్తే జీవం లేని జడ పదార్ధం నుండి జీవాన్ని, దాని నుండి మానవుణ్ణి ఉత్పన్నం చేసి ఆధ్యాత్మికానుభూతి వైపునకు క్రమ పరిణామాన్ని కొనసాగిస్తోందని అంగీకరించాల్సి ఉంటుంది.

29/05/2018

పల్లెటూర్ల ప్రస్తుత పరిస్థితి గురించి 🙏
😥నేటి పల్లెటూరు😢

ఎన్నడూ లేనిది.. పల్లెటూర్లో
గుడి ముందు ధ్వజస్థంభం మీద
రాబందులు గూళ్ళు కట్టుకున్నాయి..
ఇళ్ళల్లో ఉన్న తులసి మొక్కల మీద
పిచ్చుకలు గడ్డితో ఆవాసం ఏర్పరచుకున్నాయి.
పట్ట పగలు మనుషులంటే ఏ మాత్రం బెరుకు లేకుండా
గుడ్లగూబలు.. ఇళ్ళల్లో ఆహారాన్ని వెతుకుతున్నాయి.

అది..అక్షరాలా.. కన్నతల్లే
ఇది..అక్షరాలా.. పల్లెటూరే

ఇప్పుడు ఆ పల్లెటూళ్లలో.
మనుషులు నవ్వటం మర్చిపోయారు.
మనుషులు తనివితీరా ఏడవటానికి సదా
యుద్ధ సన్నద్ధంగా ఉన్నారు.

ఇప్పుడు ఆ ఊళ్లల్లో నాగరికత పేరుతో
మనుషులు ప్లాస్టిక్ గ్లాసులతో
నీళ్ళు తాగుతున్నారు.

మోదుగాకు విస్తరాకుల బదులు.. బద్ధకించి రెడీమేడ్ ప్లాస్టిక్ ప్లేట్లు
గొప్పతనంగా ఇళ్ళకి తెచ్చుకుంటున్నారు.

ఇప్పుడు ఆ పల్లెటూరి గాలిలో
ఎవరికీ తెలియకుండా
నగరపు యంత్రభూతాలు..
ఇంటింటికీ చేరిపోయాయి..

చాకలితో పని లేదు...వాషింగ్ మెషీన్ ఉన్నది.
కుమ్మరితో పని లేదు...ఫ్రిజ్ ఉన్నది.
మంగలితో పనిలేదు...షేవర్లు ఉన్నాయి.

దొడ్లో విశాలంగా పెరగాల్సిన మొక్కలని కూడా
చాకిరీ ఎవడు చెయ్యాలని...
కుండీలల్లోకి మార్చేసి..
వారానికోసారి చావకుండా నీళ్ళు పడుతున్నారు.

ఇంట్లో బర్రె పాలని ..
డైరీ ఫాం లకు పోసి..
అంతా బలం కోసం
రోజుకో బీ.కాంప్లెక్స్ గోలీలని మింగుతున్నారు.

మొగాళ్ళంతా బెల్టు షాపుల్లో ..ఖాతాలుపెట్టి...
క్వార్టర్లు తాగుతుంటే...
తెల్లకార్డు... వాళ్ళ ఆరోగ్యాలకి జవాబుదారీగా మారిపోయింది.

ఇప్పుడు ఆ పల్లె.‌. నేల నిండా ఏదో విషాదం దాక్కొని ఉన్నది.
చెట్ల ఆకులక్కూడ ఏదో గుర్తించలేని
మాయదారి రోగం పీక్కు తింటున్నట్లు
బ్రతకలేక బ్రతుకుతున్నాయి .

కంది చేను ..శెనగ చేను..
వరి చేను..జొన్న చేను..
అన్నీ ..రైతుల కన్నీళ్ళతో పండుతున్నట్లు ధాన్యంలో అంతా తాలు గింజలే .

ఎటు చూసినా దిక్కుతెలియని స్తబ్దత...
ఎటు చూసినా అంతు తెలియని విష సాంద్రత.‌..
ఎటు చూసినా అర్ధం కాని ఆమ్ల క్షారత...

విత్తనాల్లో ఉండాల్సిన
మాతృబిందువు కూడా ఎక్కడా.. ఎవ్వరికీ.. కనిపించకుండా..
మాయం చేస్తూ...ఏదో దుష్ట శక్తి పల్లెటూర్లనన్నిటినీ.. దురాక్రమణ చేసింది.

రచ్చబండ లేదు...
ఊరిపెద్దలంటూ ఎవ్వరూ లేరు...
పెద్దవాళ్ళంతా ..కొత్త తరాలకి
వెర్రివాళ్ళైపోయారు.

ఎవడికి వాడే గాంధీ.‌.
ఎవడికి వాడే సూపర్ హీరో...
అడ్దగోలు దొంగ వ్యాపారాలు చేసినోడు
అడ్డ దారిలో దేవుడయిపోయాడు.
పైకి రావాలంటే అడ్డదారినే రావాలనంటూ
రుజువు చేసిన అతడి దారిలో దేశాన్ని అమ్మటానికి
యువకులంతా సిద్ధమై పోయారు.

ప్రభుత్వ పాఠశాలలన్నీ.. నిర్వీర్యమై పోయాయి. గురువంటే గౌరవం లేదు.
పనిచెయ్యకుండా ప్రభుత్వపు సొమ్ము తినే.......మనుషులకు
పనికి ఆహార పథకాలయ్యాయని ప్రజల భావన.

చదువు చెప్పే టీచర్లు..పిల్లలకు
తాము చదువు చెప్పుతున్నట్లు విపరీతంగా నటిస్తున్నారు.
పిల్లలు తాము చదువు నేర్చుకుంటున్నట్లు
విపరీతంగా నటించేస్తున్నారు.
తమ పిల్లలు చదువు నేర్చుకుంటున్నట్లు
తల్లిదండ్రులు విపరీతంగా భ్రమిస్తున్నారు.

ఎటు చూసినా అంతా నటనే..
నిజాలు తెలిసినా ఎవరూ నమ్మకుండా.. మాట్లాడకుండా
అందరూ నటించటానికి అలవాటయిపోయారు

పశువుల డాక్టర్ వుద్యోగాన్ని
చేస్తున్నట్టు నటిస్తాడు.
మనుషుల డాక్టర్ కూడా వుద్యోగాన్ని
చేస్తున్నట్టు నటిస్తాడు.
కూలి పనికొచ్చిన వాళ్ళు
కూలి పనిచేస్తున్నట్టు నటించేస్తున్నారు..

పల్లెటూర్లు ఇప్పుడు
అమాయకపు పల్లెటూర్లు కావు..
పల్లెటూర్లన్నీ ఫిల్మ్ ఇన్స్టిట్యూ ట్లయ్యాయి
ప్రతిమనిషీ నటన నేర్చుకున్న మహా నటుడే.

పల్లెటూర్లల్లో ఒకప్పుడు
గ్రామ వ్యక్తిత్వానికి హీరోలు ఉండే వాళ్ళు.
ఇప్పుడు హీరోలు లేరు.
కన్న తల్లి కడుపులో ఉండగానే..
తెలుగు టీవీ సాడిస్ట్ సీరియళ్ళు చూసి..చూసి..
పళ్ళు పటపట కొరుకుతూ
పుట్టటమే విలన్లుగా పుడుతున్నారు.
మనుషులంతా తమ అసలు రూపాలను
మర్చిపోయి మారువేషాలనే ..
అసలువేషాలుగా చేసుకొని..
నటన తెలీని వాళ్ళని పిచ్చివాళ్ళని
ప్రచారం చేస్తూ సుఖంగా బ్రతుకు తున్నారు.

అర్ధరాత్రి దాక వచ్చేనిద్రని ఆపుకుంటూ
టీవీ సీరియల్స్ చూస్తూ మేల్కోవటం అలవాటయిపోయింది.
ఆంతరంగికంగా పీడకలలు కంటూ..
నిద్రని వెతుక్కోవటానికి అలవాటు పడిపోయారు.
బాహ్యశబ్దాలని చర్మేంద్రియాలద్వారా వింటూ
పగటిపూట కోడి నిద్రని అలవాటు చేసుకున్నారు.

గ్రామపంచాయతీ పంపునీళ్ళొస్తున్నాయని
వీధిబావుల్ని చెత్త, చెదారాలు వేసి మరీ
పూడ్చేసుకున్నారు.
ఇప్పుడు ఊరు తగలబడిపోయినా
ఫైరింజన్ రావాల్సిందే..
అందరూ ఏడుస్తూ
నీళ్ళు లేక కట్టుబట్టలతో నిలబడాల్సిందే.
కరెంటు లేకపోతే
అందరూ వీధి బావుల్ని
పల్లెటూర్లల్లో అప్పటికప్పుడు కొత్తగా తవ్వుకోవాల్సిందే.
ఊరు బాగుండాలని కోరుకునే వాళ్ళెప్పుడో పోయారు..
అందరూ నేను బాగుండాలని కోరుకునే వాళ్ళే...
నన్ను బాగుచేసేదే న్యాయం...
నాకు లాభాన్ని తెచ్చేదే ..ధర్మం .
నాకు డబ్బులోచ్చేలా చేసేదే నీతి.

పల్లెటూర్లల్లో కూడా మనిషి మనుగడకు
అర్ధాలు ..వ్యర్ధాలెప్పుడో అయిపోయాయి.
ప్రభుత్వం దగ్గరనించి ఏ పథకం వస్తుందా
ఎంత నొక్కేద్దామా
అని ఆలొచించేవాళ్ళే అందరూ..

పల్లెటూర్లు నాశనమవ్వటానికి
అగ్గి రాజేస్తున్నదెవ్వరు?
బుగ్గి పాలవుతున్నదెవ్వరు?
పల్లెటూర్లు నాశనమవ్వటానికి
మంటలు మండిస్తున్న దెవ్వరు?
మంటల్లో పడి నాశన మవుతున్నదెవ్వరు?

ఇళ్ళల్లో గడ్డి వాములు లేవు.
ధాన్యాన్ని దాచే కొట్లు కూడా లేవు.
ధాన్యాన్ని అటునించి అటే మార్కెట్ కి పంపేసి
స్టోర్ నించి కేజీ రెండు రూపాయల బియ్యాన్ని
తెచ్చుకొని మరీ..పొదుపు చేసినందుకు ఆనంద పడుతున్నారు.
పాడి బర్రెను మేపే ఓపిక లేక... చాలామంది
పొట్లాల పాలు తెచ్చుకొని
టీలు చేసుకుంటున్నారు.

జీవితాల్లో ప్రొడక్టివిటీ ఉన్నదన్న విషయాన్ని మర్చిపోయి
అందరూ టైంపాస్ కోసం టీవీల ముందు కూచోని
ప్రభుత్వం మాకేమీ చేయటల్లేదని
సామూహికంగా ఏడుస్తున్నారు

పల్లెటూర్లల్లో ఒకప్పటి ప్రాకృతిక
హృదయంగత సంగీతం లేదు.
నిశ్శబ్దంగా వినిపించే ఒక అసాధారణ శబ్ద
సౌందర్యమూ లేదు.
ఒకప్పటి నిశ్శబ్దపు
కవిత్వమూ లేదు.
అనాదిగా కనిపించిన పురాతన
ప్రేమతత్వమూ లేదు.

ఊళ్లల్లో బావులు ఎండిపోయాయి
ఊళ్ళల్లో మనుషులు ఎండిపోయారు.
ఊళ్ళల్లో చెరువులూ ఎండిపోయాయి.
పూవులు లేవు..పండ్లూ లేవు.

మనుషులు కేజీల లెక్కన అమ్ముడయి పోతున్నారు.
మనుషులని కేజీల లెక్కన కొంటున్నారు.

తారు రోడ్ల పక్కన పొలాలన్నీ...
రియల్ ఎస్టేట్ దెయ్యాల వెంచర్లు అవుతున్నాయి.

పల్లెటూరి గుండెల్లోంచి పైకి తన్నుకొచ్చిన
కాంక్రీటు ముళ్ళలా... పొలాలల్లో
ఎటు చూసిన సరిహద్దు రాళ్ళే దర్శనమిస్తున్నాయి.

తరాలు మారకముందే ..
చూస్తూండగానే..
పల్లెటూర్లకు వృద్ధాప్యమొచ్చింది.

మనుషులందరూ బతికుండగానే
ఊరు మాత్రం కళేబరమయిపోయింది

మనుషుల అస్థిత్వం అబద్ధమయిపోయాక
ఊర్లన్నీ ఊసర క్షేత్రాలయ్యాక
ఊర్లన్నీ...అస్థిపంజరాలుగా మిగిలి పోతున్నాయి.
మనుషులందరూ ఆదిమానవుల కాలం నాటికి..
పరుగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళిపోతున్నారు..

భవిష్యత్తులో..
పల్లెటూర్లంటే..
కాలిపోయిన పున్నాగ వృక్షాలు..
పాడు పడ్డ రామాలయాలు..
నిర్జీవమయిన ఉదయ సాయంకాలాలు మాత్రమే................................................................
నా ఈ దేశం లో పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మ లు అనడం మర్చి పోవాలేమో.

Address

Mahabubnagar
5009001

Telephone

+919985617444

Website

Alerts

Be the first to know and let us send you an email when Spot News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share