29/03/2025
#ఉగాది
ఉగస్య+ఆదిః = ఉగాది.
ఉగాది అనే మాట యుగానికి వికృత రూపమైన ఉగం నుండి పుట్టింది
యుగ + ఆది = యుగాది.......!!
భాషాపరంగా యుగాది సరైన పదం.
బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన మొదటి సంవత్సరం ప్రభవ, మొదటి ఋతువు వసంతం, మొదటి మాసం చైత్రం,మొదటి తిధి పాడ్యమి ,మొదటి వారం ఆదివారం అదే చైత్రమాస శుక్ల పాడ్యమి, ఉగాది.
మహావిష్ణువు వేదాలను అపహరించిన సోమకాసురున్ని వదించి ఆ వేదాలను బ్రహ్మకప్పగించిన శుభదినం.
నూతన కల్పంలో జగత్తు సృష్టిని బ్రహ్మ ప్రారంభించిన రోజు.
హిందువుల పండుగల సంప్రదాయానికి మొదలు ఉగాది.
వరాహమిహిరుడు ఈ ఉగాది నాడే పంచాంగాన్ని పరిచయం చేశాడని అంటారు. శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు మొదలైన వారు ఉగాదినాడే పట్టాభిషిక్తులైనారని ఆర్యులు చెబుతారు. సంవత్సరాది నాడు ప్రజలు తెల్లవారక ముందే నిద్ర లేచి,
కాలకృ త్యాలు తీర్చుకొని, తలకు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి, ఇష్టదైవానికి పూజలు చేసి, షడ్రుచుల పచ్చడిని ఆరగించాలి. నిర్ణీత సమయంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం చేయాలి.
తిథిర్వారం చ నక్షత్రం
యోగః కరణమేవ చ,
పంచాగస్య ఫలం శృణ్వన్
గంగాస్నాన ఫలం లభేత్.
తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే పంచాంగ శ్రవణం వల్ల గంగా స్నానంతో సమానంగా పుణ్యం, పురు షార్థం లభిస్తుందని పై శ్లోకం చెబుతున్న భావం.
కొత్త సంవత్సరంలో గ్రహ, రాశిఫలాల్లో, నామ నక్షత్రాల్లో తేడా వస్తే దోషనివారణ కోసం శాంతి హోమాలు, వ్రతాలు, పూజలు చేసి సుఖశాంతులతో ప్రజలు జీవించడానికి పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది.
పంచాంగ శ్రవణం చేసిన వారికి విన్నవారికి నవగ్రహానుగ్రహం లభిస్తుంది.
నవగ్రహాల్లో సూర్యుడి వల్ల శౌర్యం , చంద్రుడు భోగభాగ్యాలను, కుజుడు శుభాలను, బుధుడు బుద్ధివికాసాన్ని, గురుడు జ్ఞానం ,విద్యని,శుక్రుడు సుఖాలను, శనీశ్వరుడు దుఖ వినాశాన్ని, రాహువు కీర్తి నీ,కేతువు వంశ వృద్ధి కలిగిస్తారని విద్వాంసులు చెబుతారు.
షడ్రుచుల సమ్మేళనం
ఆరు రుచుల కలయికతో అనారోగ్యా లను అంతం చేసేది ఉగాది. ఆరోగ్యమనే మహాభాగ్యాన్ని కలిగించేది ఉగాది పచ్చడి. శాస్త్రవచనాల్లో దానికి నింబకుసుమ భక్షణం, అశోకకళికా ప్రాశనం అనే పేర్లు కూడా ఉన్నాయి. తీపి, ఉప్పు, చేదు, వగరు, పులుపు, కారం సమపాళ్లలో కలిపి ఈ పచ్చడిని తయారు చేస్తారు. తీపికి బెల్లం, ఉప్పునకు ఉప్పు, చేదుకు వేపపూత, వగరుకు మామిడి ముక్కలు, పులుపునకు చింతపండు, కారమునకు మిరియాలు ఉగాది పచ్చడిలో వాడుతారు.