08/03/2022
#రేపటి_నుంచి_నృసింహుని_బ్రహ్మోత్సవాలు
* 16న పొన్నవాహనోత్సవం.
* 17న స్వామివార్ల కల్యాణోత్సవం
* 18న దివ్య రథోత్సవం.
మంగళాద్రి క్షేత్రంలో కొలువైన శ్రీ పానకాల లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచింది. దేశంలో అష్టవైష్ణవ క్షేత్రాలలో మహాపుణ్యక్షేత్రంగా పేరొందింది. ఎగువ సన్నిధిలో స్వామివారు పానకాన్ని సేవిస్తూ ఉండడం వల్ల పానకాల స్వామిగా పిలుస్తారు.
భక్తులు సమర్పించే పానకంలో సగం మాత్రమే స్వీకరిస్తారు. పానకం వొలికినా ఒక్క ఈగ కూడా ఉండకపోవడం క్షేత్రమహిత్యంగా చెప్పుకుంటారు. ఇక దిగువసన్నిధి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ద్వాపరయుగంలో పాండవుల అరణ్యవాస సమయంలో ధర్మరాజు ప్రతిష్ఠించారు. శ్రీకృష్ణదేవరాయలు మంటప నిర్మాణం గావించగా, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అతి ఎత్తయిన రాజగోపురాన్ని నిర్మించారు.
యుగయుగాల దేవుడు శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతియేటా ఫాల్గుణ శుద్ధ షష్ఠి నుంచి బహుళ విదియ వరకు 12 రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. లోక కల్యాణార్థం దిగువ సన్నిధిలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది మార్చి 9వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే), ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ల నేతృత్వంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపురెడ్డి కోటిరెడ్డి పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం పెళ్లి కుమారుడి ఉత్సవంతో ప్రారంభమయ్యే ఈ బ్రహ్మోత్సవాల్లో పొన్న వాహనోత్సవం, స్వామి వార్ల కల్యాణం, దివ్య రథోత్సవం అత్యంత ముఖ్య ఘట్టాలు. ఉత్సవాల్లో వరుసగా హనుమంత, రాజాధిరాజ, యాలి, సింహ, హంస, గజ, కల్పవృక్ష, పొన్న, అశ్వ వాహనాలపై స్వామి వారు తిరువీధులకు వేంచేస్తారు.
ొన్నవాహన_సేవ
మనలను మనం రక్షించుకొను ప్రయత్నం చేయునంతకాలం స్వామి మనను రక్షించడు. అన్యధా శరణం నాస్తి, త్వమేవశరణుమమ… అని రెండు చేతులు ఎత్తి ఎలుగెత్తి పిలవాలి. మన రక్షణ భారాన్ని స్వామియందే ఉంచాలి. అలా శరణుజొచ్చిన భాగవతోత్తములే గోపికలు. గోపికలను ఎలా రక్షించాడో అలాగే పొన్నవాహనోత్సవాన్ని దర్శించిన మనందరినీ శ్రీస్వామివారు రక్షిస్తారు.
్యాణ_మహోత్సవం.
స్వామి కల్యాణానికి ముందు చెంచులు తమ ఆడపడుచు చెంచులక్ష్మిని నరసింహస్వామి వివాహం చేసుకున్న గుర్తుగా ఆలయ ఆవరణలో ఉత్సవం నిర్వహిస్తారు. శ్రీవారు శేషవాహనంపై గ్రామోత్సవంలో పాల్గొని ఎదుర్కోల ఉత్సవం జరుపుకొని అర్ధరాత్రి కల్యాణ వేదికను అలంకరిస్తారు. పట్టణ పద్మశాలీయ బహూత్తమ సంఘం వారు తమ ఆచారం ప్రకారం మధుపర్కాలు, మంగళ ద్రవ్యాలు సమర్పిస్తారు. వైకుంఠ నగరంలో శోభాయమానంగా ప్రకాశించే ఈ వేదికపై స్వామి వారి కల్యాణాన్ని తిలకించిన వారందరికీ శుభాలు కలుగుతాయి.
్రీవారి_దివ్యరథోత్సవం
‘రథస్థం కేశవ దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే’ రథారూఢుడైన స్వామిని దర్శిస్తే పునర్జన్మ ఉండదు. భక్తజనులు, ముక్కోటి దేవతలు ఈ దివ్య రథోత్సవాన్ని దర్శించి పులకించిపోతారు. పెద్ద రథం ఆరు చక్రాలతో అత్యంత సుందరంగా, గంభీరంగా ఉంటుంది. ఎంతో ఎత్తుతోపాటు అధిక బరువు కలిగి, పరిమళ పుష్పాలమాలతో గంభీరమైన ఈ మహారథం కదిలితే చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఈ క్రమంలో రథారూఢుడైన కల్యాణ శ్రీ లక్ష్మీనరసింహ స్వామివార్లను దర్శించుకుని రథచక్రాలకు భక్తి పారవశ్యంతో టెంకాయలు కొట్టి ముక్తిని పొందాలని ప్రతి ఒక్క భక్తుడు అనుకుంటాడు. రథోత్సవంలో రథాన్ని లాగేందుకు వేలాది మంది పోటీపడతారు. రథ గమన వేగాన్ని నిర్దేశించేలా రథచక్రాలకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్ల చప్పాల బృందం చప్పాలను వేస్తుంటుంది. ఈ మహోత్సవంలో ఒక కీలక పాత్ర వహించే అవకాశం రావడాన్ని చప్పాల బృందం మహత్ భాగ్యంగా భావిస్తుంది. మంగళగిరి తిరునాళ్ళుగా ప్రసిద్ధి గాంచిన రథోత్సవం నాడు భక్త జనం సంద్రాన్ని తలపించనుంది.
Mangalagiri Media
మంగళగిరి వైభవం
Mangalagiri Politics
మంగళగిరి వైభవం
మంగళగిరి
మంగళగిరి పద్మశాలి