29/04/2024
నిర్ణయం ‘ఆమె’దే...
* మంగళగిరిలో అతివల ఓట్లే అధికం
* నియోజకవర్గ ఓటర్లు 2,92,432
* పురుషులు 1,40,660.. మహిళలు 1,51,759
* ఓటర్ల తుది జాబితా విడుదల
* జిల్లాలో మంగళగిరి ఓటర్లే అత్యధికం
సార్వత్రిక సమరంలో ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య లెక్క తేలింది. తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. విభజిత గుంటూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలతో పోలిస్తే మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం (2,92,432) లోనే ఓటర్లు అత్యధికంగా వున్నారు. ఆ తరువాతి స్థానాల్లో వరుసగా గుంటూరు పశ్చిమ (2,78,158), ప్రత్తిపాడు (2,67,888), తెనాలి (2,67,624), గుంటూరు తూర్పు (2,50,691), పొన్నూరు (2,27,135), తాడికొండ (2,07,615) వున్నాయి. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా తరువాత వచ్చిన క్లయిమ్‌లను పరిష్కరించి, కొత్త వారికి ఓటు హక్కు అవకాశం కల్పిస్తూ తుది జాబితాను ఆదివారం విడుదల చేశారు. జనవరిలో విడుదల చేసిన జాబితాతో పోలిస్తే ప్రస్తుత తుది జాబితాలో 3,354 మంది అదనంగా చేరారు. మంగళగిరిలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా వున్నారు. మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి మంగళగిరి రూరల్ మండలంలో అత్యధిక ఓట్లు నమోదు కాగా, తాడేపల్లి రూరల్ మండలంలో అత్యల్పంగా ఓట్లు నమోదయ్యాయి. నియోజకవర్గంలోని తాడేపల్లి అర్బన్, రూరల్, మంగళగిరి అర్బన్, రూరల్, దుగ్గిరాల మండలాల్లో అన్నిచోట్లా పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా వున్నారు. నియోజకవర్గంలో పురుషులు 1,40,660 మంది, మహిళలు 1,51,759 మంది, ఇతరులు 13 మందిని కలుపుకుని మొత్తం 2,92,432 మంది ఓటర్లు వున్నారు. పురుషుల కంటే మహిళలు 11,099 మంది ఎక్కువగా వున్నారు. దీంతో మే 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో మహిళల నిర్ణయమే కీలకంగా మారనుంది. అతివల మద్దతు ఎటువైపు మొగ్గుతుందో ఫలితాలు వెల్లడయ్యే వరకు వేచిచూడాల్సిందే!
-అన్వేష్