18/10/2025
గూగుల్, అమెజాన్, మైక్రోసాప్ట్ రక్తపు కూడు!
బిల్ గేట్స్ దానకర్ణుడు, గూగుల్ అభివృద్ధి కారకుడు, అమెజాన్ తో అంతా బాగుపడుతుందన్నట్టే ఉంటాయి మనకి చెప్పే కథలు. కానీ వాటి అభివృద్ధి వెనుక పెద్ద నేర చరిత్ర ఉంది. తాజాగా గాజాలో ఇజ్రాయెల్ సాగించిన నరమేధంలో కూడా వీళ్లంతా పాత్రధారులు కావడం అందుకు సజీవ సాక్ష్యం.
ఈ టెక్ దిగ్గజాలుగా చెప్పుకుంటున్న వాళ్లంతా ఆయా దేశాల్లో సామాన్యుల జీవితాల్లో చొరబడతారు. మనం ఏం చేస్తున్నామో, ఏం తింటున్నామో, చివరకు ఏం ఆలోచిస్తున్నామో కూడా నిర్దేశిస్తారు. చివరకు వాటిని అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకుంటారు. అమెరికా అంచనాలకు భిన్నంగా సాగితే కట్టడి చేసేందుకు కూడా అదే టెక్నాలజీని వినియోగిస్తారు. సరిగ్గా గాజాలో అదే జరిగింది.
గాజా వాసుల అభిప్రాయాలు, ఆలోచనలు, అడుగులు అన్నీ ఈ సంస్థల ద్వారా నేరుగా ఇజ్రాయెల్ కి చేరాయి. యుద్ధ నేరాల్లో ఆరితేరిన ఇజ్రాయెల్ సాగించిన మారణకాండకి, గాజా వాసులు చిందించిన రక్తానికి మైక్రోసాప్ట్, గూగుల్, అమెజాన్ వంటివి ఆయుధాలయ్యాయి. భారీ సంఖ్యలో ప్రాణాలు తీసేందుకు కారణమయ్యాయి.
ఇటీవల అమెరికాకి భారత ప్రభుత్వ తీరు మింగుడుపడడం లేదు. అటు రష్యా, ఇటు చైనాతో సన్నిహితంగా మెలిగే ప్రయత్నం చేయడమే మంటపుట్టించింది. బ్రిక్స్ పేరుతో ప్రత్యామ్నాయ కరెన్సీ ప్రయత్నాలు ముమ్మరం కావడం సహించలేకపోయింది. డాలర్ గుత్తాధిపత్యానికి తెరపడుతుందంటే తల్లడిల్లిపోయింది. ఆ ఉక్రోశం నుంచే ట్రంప్ సాగించిన వికృత క్రీడకు ఇండియా బలి అయ్యింది. ఆక్వా రంగం నుంచి ఫార్మా వరకూ అనేక పరిశ్రమలు విలవిల్లాడాయి.
అమెరికా ఎంత దూకుడు ప్రదర్శించినా, చివరకు పాకిస్తాన్ కి పూర్తి అండదండలు అందిస్తూ వైట్ హౌస్ వేదికగానే ముచ్చట్లు పెడుతున్నా మోదీ పల్లెత్తుమాట అనకుండా సాగిపోవడంతో ఇప్పుడు కొంత చల్లబడుతున్నట్టు కనిపిస్తోంది. కానీ అమెరికాకి ఇండియా వైఖరి ఎప్పుడైనా ప్రమాదమే అనే అభిప్రాయం ట్రంప్ టీమ్ లో స్పష్టంగా వినిపించింది. అంటే భారతదేశ ప్రయోజనాలకు అనుగుణంగా రష్యాతో సానుకూలంగా సాగినా, చైనాకి స్నేహ హస్తం అందించినా అమెరికాకి రుచించదు. అలాంటి సమయంలో ఇండియాని దారికి తెచ్చుకునే ప్రయత్నంలో అమెరికాకే చెందిన ఈ టెక్ దిగ్గజాలన్నీ తోడ్పడతాయనడం నిస్సందేహం.
గూగుల్ హఠాత్తుగా అమెరికా వెలుపల పెడుతున్న పెద్ద పెట్టుబడి అంటూ వైజాగ్ డేటా సెంటర్ ఏర్పాటు ఆసక్తికర అంశం. ఇజ్రాయెల్ సాగించిన విధ్వంసంలో ఈ సంస్థలు నడిపిన దుర్మార్గపు క్రీడ మూలంగా అనుమానించాల్సిన విషయం. భవిష్యత్తులో ఇండియా తన ప్రయోజనాలకు భిన్నంగా సాగితే అమెరికా ఆడబోయే ఆటలో పావులుగా మారినా ఆశ్చర్యం లేదు.
ప్రపంచంలో ఏదేశాన్నయినా తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకునేందుకు, తన చేతుల్లోంచి చేజారిపోకుండా చూసుకునేందుకు అమెరికన్ ప్రభుత్వాలు వేసే ఎత్తులు అనేక రకాలుగా ఉంటాయి. పెట్టుబడుల పేరుతో ఆయా ప్రభుత్వాలను తమకనుకూలంగా మలచుకోవడం అందులో ఓ భాగం అంతే.
ఇక ఇజ్రాయెల్-గాజా పరిణామాల్లో ఈ టెక్ సంస్థల వికృత క్రీడను వివరిస్తూ ప్రజాశక్తిలో వచ్చిన ఈ కథనం చదవండి.