11/10/2022
"నయనతార తల్లి కావడంపై వివాదం ఏంటి... సరోగసి చట్టాలు ఏం చెబుతున్నాయి?"
సినీ నటి నయనతార, ఆమె భర్త, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌లు తాము తల్లిదండ్రులు అయినట్లు ప్రకటించారు. తమకు మగ కవల పిల్లలు పుట్టినట్లు వారు తెలిపారు.
కానీ ఎలా పుట్టారో వారు వెల్లడించనప్పటికీ సరోగసి ద్వారా వారు బిడ్డలను కన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
దీనిపై కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించింది. కవల పిల్లల పుట్టుకకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఈ దంపతులను తమిళనాడు వైద్య, ప్రజా సంక్షేమ శాఖ మంత్రి ఎం సుబ్ర్మణ్యం కోరారు.
ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘నయనతార, విఘ్నేశ్ శివన్‌లు పెళ్లి తర్వాత ఇంత తక్కువ సమయంలోనే తల్లిదండ్రులు ఎలా అయ్యారు? వారు చట్టంలోని నిబంధనల ప్రకారమే నడుచుకున్నారా? దీనిపై దృష్టి సారించాల్సి ఉంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డీఎంఎస్) ద్వారా వివరణ కోరతాం ’’ అని అన్నారు.
ఎందుకు వివాదం అయ్యింది?
నయనతారకు విఘ్నేశ్ శివన్‌కు ఈ ఏడాది జూన్ 9న పెళ్లి జరిగింది. అంతకు ముందు నుంచే కొద్ది సంవత్సరాలుగా వారు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.
వారికి పెళ్లి జరిగి నాలుగు నెలలు దాటింది. ఇప్పుడు వారు తమకు బిడ్డలు పుట్టినట్లు ప్రకటించారు. ఇప్పుడే ఇదే వివాదంగా మారుతోంది.
చట్టం ఏం చెబుతోంది?
సరోగసి(నియంత్రణ) చట్టం-2021 ప్రకారం భారత్‌లో పెళ్లి అయిన జంటలతోపాటు విడాకులు తీసుకున్న లేదా భర్త చనిపోయిన ఒంటరి మహిళలు మాత్రమే సరోగసి ద్వారా బిడ్డలు కనవచ్చు.
నయనతార దంపతులకు సరోగసి ద్వారా బిడ్డలు పుట్టారు అని భావిస్తే వారు పెళ్లికి ముందే సరోగసి ప్రాసెస్ మొదలు పెట్టినట్లు అవుతుంది. అంటే వారు పెళ్లి చేసుకోవడానికి సుమారు 5 నెలల ముందే అద్దె గర్భంలో నయనతార దంపతుల బిడ్డలు పెరగడం మొదలైంది.
ఆవిధంగా చూస్తే నయనతార దంపతులు చేసింది చట్టప్రకారం నేరం అవుతుంది.
ఈ విషయం మీద నయనతార దంపతులను వివరణ అడుగుతామని తమిళనాడు వైద్యశాఖ మంత్రి ఇప్పటికే ప్రకటించారు.
"సరోగసి అంటే ఏంటి?"
నిబంధనలు ఇలా...
సరోగసి(నియంత్రణ) - 2021 చట్టం ప్రకారం బిడ్డను కోరుకునే జంటకు కచ్చితంగా పెళ్లి జరిగి ఉండాలి. మహిళ వయసు 23 నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి. పురుషుని వయసు 26 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
సరోగసి ద్వారా పిల్లలను కోరుకునే దంపతులకు పిల్లలు ఉండకూడదు. ఎవరిని దత్తత తీసుకోని ఉండకూడదు. లేదా సరోగసి ద్వారా కూడా పిల్లలను కని ఉండకూదు.
అయితే పిల్లలు మానసికంగా లేదా శారీరకంగా వైకల్యంతో ఉన్నప్పుడు లేదా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నప్పుడు దంపతులు సరోగసి ద్వారా మరొక బిడ్డను కనొచ్చు.
సరోగసి ద్వారా పిల్లలను కనాలంటే ఆ అవసరం ఉందో లేదో ముందు సంబంధిత వైద్య అధికారుల నుంచి దంపతులు అనుమతి తీసుకోవాలి.
కోర్టులో పిటీషన్
సరోగసి(నియంత్రణ) చట్టం-2021లో పెళ్లి కానీ వ్యక్తుల గురించి ప్రస్తావన లేదు. ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులు, ఎల్జీబీటీ కమ్యూనిటీకి సరోగసి ద్వారా బిడ్డలను కనే అవకాశాన్ని ఈ చట్టం ఇవ్వడం లేదు.
సహజీనవంలో ఉండే జంటలకు కూడా సరోగసి అవకాశం లేదు.
దాంతో కొందరు దీని మీద ఈ ఏడాది మేలో దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇలా పిల్లలను కనే హక్కును దూరం చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్-21కి విరుద్ధమని పిటీషనర్ వాదించారు.
ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది.
అద్దె గర్భం ద్వారా పిల్లలను కనడాన్ని సరోగసీ అంటారు. అంటే ఇక్కడ వేరే మహిళ, పురుషులకు చెందిన బిడ్డను
మరొక మహిళ తన గర్భంలో మోస్తారు. బిడ్డను మోసే మహిళకు ఆ బిడ్డ మీద ఎటువంటి హక్కులు ఉండవు.
సరోగసి ద్వారా పిల్లలను కంటున్న సెలబ్రిటీలు
భారత్‌లో సరోగసీ ద్వారా పిల్లలను కనడమనేది ఎంతో కాలం నుంచి వస్తోంది. ఒకప్పుడు విదేశీయులు కూడా ఇక్కడకు వచ్చి సరోగసి ద్వారా బిడ్డలను పొందేవారు. కానీ 2015లో విదేశీయులు భారత్‌లో సరోగసీ ద్వారా బిడ్డలను కనకుండా నిషేధించారు.
మంచు లక్ష్మీ, ప్రియాంక చోప్రా, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, కరణ్ జోహార్ వంటి వారు సరోగసి ద్వారా పిల్లలను కన్నారు.
2011లో సరోగసి ద్వారా ఆమిర్ ఖాన్ బిడ్డను కన్నారు.
2013లో షారుఖ్ ఖాన్ దంపతులకు సరోగసి ద్వారా అబ్‌రామ్ పుట్టాడు.
2014లో మంచు లక్ష్మి దంపతులు సరోగసి ద్వారా ఒక అమ్మాయికి జన్మను ఇచ్చారు.
2017లో బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ సరోగసి ద్వారా పిల్లలను కన్నారు. ఆయన సింగిల్ పేరెంట్.
2022 జనవరిలో ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ సరోగసి ద్వారానే తల్లిదండ్రులు అయ్యారు.
సరోగసి చుట్టూ వివాదాలు
జపాన్‌కు చెందిన దంపతులు 2008లో సరోగసి ద్వారా ఆడ బిడ్డను కన్నారు. అయితే ఆ తరువాత జపాన్‌కు చెందిన ఆ దంపతులు విడిపోయారు. దాంతో బిడ్డ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు తండ్రి. కానీ ఒంటరి పురుషునికి ఆడ పిల్లను దత్తత ఇవ్వడానికి భారత చట్టాలు ఒప్పుకోవు. చివరకు సుప్రీం కోర్టు పాపను ఆ అమ్మాయి గ్రాండ్ మదర్‌కు ఇచ్చింది.
అదే ఏడాది మరొక కేసులో జర్మనీకి చెందిన దంపతులు భారత్‌లో సరోగసి ద్వారా కవల పిల్లలను కన్నారు. ఆ దంపతులు బ్రిటన్‌లో పని చేస్తున్నారు. ఆ కవల పిల్లలను బ్రిటన్ తీసుకుపోవడానికి పాస్‌పోర్టు ఇవ్వడానికి భారత అధికారులు నిరాకరించారు. కారణం వారికి పౌరసత్వం లేకపోవడం. జర్మనీలోనూ సరోగసి చట్టాలు లేవు. చివరకు సుప్రీం కోర్టు జోక్యంతో ఆ పిల్లలను వారి తల్లిదండ్రులు తీసుకెళ్లారు.
ఆ తరువాత విదేశీయులకు సరోగసి సేవలను 2015లో భారత్ నిషేధించింది. సరోగసీని వాణిజ్యపరంగా వాడటాన్ని కూడా నిషేధిస్తూ చట్టాన్ని తీసుకొచ్చింది.