03/07/2025
రాయలసీమ ప్రాజెక్టులకు తక్షణమే త్రాగునీరు, సాగునీరు విడుదల చేయాలని రాయలసీమ ప్రజా సంఘాలు జల వనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ కార్యాలయం, కర్నూలు వద్ద జూలై రెండు 2025న పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం అయినది. ఈ సందర్భంగా
చీఫ్ ఇంజనీర్ గారికి అందజేసిన రిప్రజెంటేషన్ ....
జులై 2, 2025
జలవనుల శాఖ , కర్నూలు
అయ్యా ,
విషయం : తుంగభద్ర డ్యాం మరియు శ్రీశైలం ప్రాజెక్టు వెనక జలాల నుండి రాయలసీమ ప్రాజెక్టులకు తక్షణమే నీటి విడుదల చేపట్టాలని విజ్ఞప్తి.
ఈ వర్ష సంవత్సరం అత్యధిక వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అంచనా ప్రకారం ఎగువన వర్షాల కారణంగా శ్రీశైలం రిజర్వాయర్ కు మరియు తుంగభద్ర డ్యాంకు కూడా గణనీయంగా నీటి ప్రవాహం మొదలైంది. శ్రీశైలం రిజర్వాయర్ లో 875 అడుగులలో 165 టి ఎం సి లు, తుంగభద్ర డ్యాంలో 1625 అడుగులలో 75 టి ఎం సి ల నీరు చేరింది. అయితే జూన్ 1 2025 న మొదలైన ఈ వర్ష సంవత్సరంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు రాయలసీమలో ఏర్పడ్డాయి. వాటిలో కీలకమైనవి …
1. ఋతుపవనాలు మృగశిర కార్తికంటే ముందుగానే రాయలసీమలో ప్రవేశించి విస్తారంగా వర్షాలు కురవడం.
2. వర్షాలను నమ్ముకొని రాయలసీమలో ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా పత్తి, మినుము, మొక్కజొన్న, సోయాబీన్, కంది, వేరుశనగ పంటలు వేయడం.
3. త్వరగా ప్రవేశించిన ఋతుపవనాలు దోబూచులాడుతుండడంతో ఈ సంవత్సరం ఖరీఫ్ లో వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించడం. అక్కడక్కడ వేసిన పంటలను దున్నేస్తున్న పరిస్థితి ఉండటం.
4. తుంగభద్ర డ్యాములో పూడికతో నష్టపోతున్న తుంగభద్ర దిగువ కాలువ (LLC), తుంగభద్ర ఎగువ కాలువ (HLC) రైతాంగానికి ప్రాజెక్టు బలహీనమైన గేట్ల రూపంలో మరింత నష్టం చేకూర్చే పరిస్థితి తలెత్తడం.
5. ప్రకృతి కనికరించినా, బలహీనమైన గేట్లను మార్చకపోవడం వల్ల తుంగభద్ర డ్యామ్ లో 80 TMC ల కంటే అదనంగా నీరు పెట్టకూడదన్న నిపుణుల సూచన వెనకబడిన రాయలసీమకు శాపంగా మారడం.
6. తుంగభద్ర డ్యామ్ కు అదనంగా వస్తున్న నీటిని నదిలోకి వదిలి సముద్రం పాలు చేయడానికైనా సిద్ధమైన తుంగభద్ర బోర్డు, LLC, HLC కాలువలకు ముందే నీరు వదలడానికి కార్యాచరణ చేపట్టకపోవడం.
7. వెనక జలాల (బ్యాక్ వాటర్) నుండి నీరు తీసుకోవడానికి అవసరమైన 854 అడుగుల నీటిమట్టం జూన్ 22 నాటికే శ్రీశైలం రిజర్వాయర్ చేరడం.
8. పోతిరెడ్డిపాడు నుండి 30 రోజులలో వరద నీటిని తరలించడానికి అవసరమైన శ్రీశైలం కుడి ప్రధాన కాలువ (SRMC), బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ ఉన్నప్పటికీ … దాని కొనసాగింపుగా ఉన్న తెలుగుగంగ, ఎస్ ఆర్ బి సి (SRBC), గాలేరునగరి సంబంధించిన ప్రాజెక్టుల రిజర్వాయర్లు, కాలువల నిర్మాణాలు ప్రారంభించి 30 నుండి 40 సంవత్సరాలైన పూర్తిగా నిర్మాణాలు జరగక పోవడం మరియు నిర్వహణ లోపాల వలన శ్రీశైలం రిజర్వాయర్ కు 150 రోజుల వరద ఉంటే గానీ ఈ ప్రాజెక్టులకు నీటిని తీసుకోలేని పరిస్థితి ఉండటం.
9. హంద్రీనీవా ప్రధాన కాల్వ తగిన సామర్థ్యంతో లేకపోవడం, రిజర్వాయర్ల సామర్థ్యము తక్కువగా ఉండటంతో పాటు నిర్వహణ సక్రమంగా లేకపోవడం, డిస్ట్రిబ్యూటరీస్, పంట కాలువల నిర్మాణం పూర్తి చెయ్యకపోవడం వల్ల ఆయకట్టుకు నీరు అందించలేని పరిస్థితి ఒకవైపు ఉంటే .... సంవత్సర కాలం పూర్తిగా ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించినా చెరువులు కూడా నింపలేని పరిస్థితి మరొకవైపు ఉండటం.
10. ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు అంచనా వేస్తున్న సందర్భంలో శ్రీశైలం రిజర్వాయర్ నుండి కృష్ణా జలాలు సముద్రంపాలు చేయడం నిలువరించాలంటే తక్షణమే శ్రీశైలం వెనక జలాలను రాయలసీమ ప్రాజెక్టులకు మళ్ళించడానికి కార్యాచరణ చేపట్టాల్సి ఉండటం.
11. శ్రీశైలం రిజర్వాయర్ నుండి సాగునీటి హక్కులు ఉన్న SRBC, అంతర్గత సర్దుబాటుతో కేసి కెనాల్ కు 10 Tmc ల నీటి హక్కులు, మద్రాసు త్రాగనీరు తదితర నికర జలాల హక్కులతో పాటు రాయలసీమలో మిగులు జలాల మీద నిర్మించిన ప్రాజెక్టులకు (తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టులకు) రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నీరు పొందే హక్కు ఉందన్న విషయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన పరిస్థితి ఉండటం.
రాయలసీమ ప్రాంత త్రాగు, సాగు నీటి హక్కులను కాపాడుతూ, ఈ ప్రాంతానికి నష్టం కలుగకుండ రక్షించడానికి పైన వివరించిన ప్రతి ఒక్క అంశాన్ని అత్యంత కీలకంగా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తుంగభద్ర డ్యాం మరియు శ్రీశైలం ప్రాజెక్టు వెనక జలాల నుండి రాయలసీమ ప్రాజెక్టులకు తక్షణమే నీటి విడుదల చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ధన్యవాదాలు
రాయలసీమ ప్రజా సంఘాలు మరియు అఖిలపక్షం