29/07/2025
మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణ
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో గత 14 రోజులుగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెను పట్టణ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ హామీ మేరకు విరమించినట్లు కమిషనర్ వై.ఓ నందన్ ప్రకటించారు.
కార్పొరేషన్ కార్యాలయంలో రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కమిషనర్ నందన్ ల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులతో మంగళవారం చర్చలు జరిపారు.
ముఖ్యంగా కార్మికుల డిమాండ్లలో ప్రధాన అంశంగా ఉన్న తొమ్మిదవ డివిజన్లో కాంట్రాక్టు విధానం అమలుపై మంత్రి నారాయణ స్పష్టత ఇవ్వడంతో కార్మికులు సమ్మెను నిరవధికంగా విరమించినట్లు కమిషనర్ వెల్లడించారు. పైలెట్ ప్రాజెక్టు నిర్వహణ కోసం చేపట్టిన కాంట్రాక్టు విధానాన్ని పూర్తిస్థాయిలో రద్దుచేసి నూతన విధి విధానాలపై పునరాలోచించేందుకు త్వరలో మంత్రి నారాయణతో కార్మిక సంఘాల నాయకులు భేటీ కానున్నారని తెలిపారు.
రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం, వారి ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. మున్సిపల్ కార్మికుల ఉద్యోగ విరమణ అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించే అంశాన్ని మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్లి, కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భద్రతను కలిగిస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుధ్య నిర్వహణ పనుల కోసం కార్మికులంతా వెంటనే తిరిగి విధుల్లో పాల్గొనాలని కమిషనర్, ఎమ్మెల్యేలు కోరారు.
ఈ చర్చలలో మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు మూలం రమేష్, మాదాల వెంకటేశ్వర్లు, కత్తి శ్రీనివాసులు, పెంచల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.