21/09/2025
సాంప్రదాయాలను ఆచారాలను పాటించే వారికి ఈరోజు ఓ పవిత్రమైన దినం. గతించిన పెద్దలకు తర్పణాలు వదులుకునే మహాలయ అమావాస్య రోజు ఇది. ఆదివారం , అమావాస్య,, మహాలయ పర్వదినం.. ఈ మూడు కలిసిన రోజున సాగరం ఎలా ఊరుముతుందో, ఉరకలు వేస్తుందో చూడండి. సముద్ర తీరంలో రామలింగేశ్వర ఆలయం వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో సముద్రం తెల్లవారి నుంచి మహోగ్ర రూపంలో ఉంది. భక్తులు తెల్లవారి నుంచి సముద్రానికి వచ్చి పెద్దలకు తర్పణాలు వదిలేందుకు సిద్ధమవుతున్నారు. సెలవు దినాలు కూడా కావడంతో సముద్ర తీరం వద్దకు భక్తులు పర్యాటకులు రావడం మొదలు పెడుతున్నారు. పోలీసులు కూడా భద్రత ఏర్పాట్లు చేశారు. తీరంలో ఈరోజు అంతా పూజాదిక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. మహాలయ అమావాస్య రోజున అన్ని నదులు కలిసే సముద్ర తీర ప్రాంతంలో గతించిన పెద్దలకు తర్పణాలు వదలడం అనేది అనాదికాలంగా వస్తున్న ఆచారం. సముద్రం లేని ప్రాంతంలో నదులు, నదులు లేని ప్రాంతంలో బావులు, బావుల్లేని ప్రాంతంలో ఇళ్ల వద్దనే పెద్దలకు తర్పణాలు వదులుకోవడం అనేది ఆచారం . మహాలయ పర్వదినాలు ఆదివారం అమావాస్య రోజునే ప్రారంభం కావడంతో విశిష్టమైన రోజుగా భావిస్తున్నారు. దానికి తోడు సముద్రం వద్ద పెట్టే తర్పణాలు, సాగరం తనలోకి తీసుకుంటే పరలోకాల్లో ఉన్న పెద్దల ఆత్మలు మనం వదిలే తర్పణాలు స్వీకరించినట్టేనని భావిస్తారు.