18/12/2024
_*🕉️🪷---"శ్రీ విష్ణు పురాణం"---🪷🕉️*_
_*శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః*_
_*శ్రీ గురుభ్యోనమః*_
_* 17వ భాగం:-*_
స్వాయంభువనందనుడైన ప్రియవ్రతుని భార్య కుక్షి. ఆమె కర్దమ ప్రజాపతి కూతురు. ఆ దంపతులకు పదిమంది కొడుకులు. వారు - అగ్నీధ్రుడు, మేధాతిథి, వపుష్యంతుడు, జ్యోతిష్మంతుడు, ద్యుతిమంతుడు, హవ్యుడు, సవనుడు, మేథుడు, అగ్నిబాహుడు, పుత్రుడు.
వారిలో మేథుడు, అగ్నిబాహుడు, పుత్రుడు పూర్వజన్మ స్మృతికలవారై విరక్తులై యోగనిరతులై భువి నుంచి వెళ్లిపోయారు. మిగిలిన ఏడుగురు కుమారులలో ఆగ్నీధ్రునకు జంబూద్వీపం, మేథాతిథికి ప్లక్షద్వీపం, వపుష్మంతునకు శాల్మలి, జ్యోతిష్మంతునకు కుశద్వీపం, ద్యుతిమంతునకు క్రౌంచద్వీపం, హవ్యునకు శాకద్వీపం, సవనునకు పుష్కరద్వీపం ఇచ్చి రాజ్యాభిషిక్తులను చేశాడు. వారు ఇంద్రమిత్రులై సప్తద్వీపాలనూ ఎదురులేని పరాక్రమముతో ధర్మమార్గాన పాలించారు.
జంబూద్వీపాధిపతియైన ఆగ్నీధ్రునకు తొమ్మిది మంది కొడుకులు. నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యుడు, హిరణ్వంతుడు, కురుడు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అని వారి పేర్లు.
ఆ తండ్రి జంబూద్వీపమును తొమ్మిది భాగాలుగా చేసి వాటికి వరుసగా వారిని రాజులనుగా చేశాడు. తరువాత ఆగ్నీధ్రుడు సాలగ్రామ తీర్థానికి పోయి తపస్వి అయ్యాడు. ఆ కొడుకులు పాలించే నవఖండాలూ వారి పేర్లతో వర్షసంజ్ఞలు కలవయ్యాయి.
నాభి హిమగిరికి దక్షిణభాగముగా ఉన్న భూమికి అధిపతి అయ్యాడు. అతని కొడుకు వృషభుడు. అతనికి నూర్గురు కొడుకులు. వారిలో పెద్దవాడు భరతుడు.
ఆ భరతుడు భూపతియై శత్రుభంజనుడు, ప్రజారంజనుడై భూమిని పాలించి ఇంద్రునకు ప్రేమాస్పదుడయి యజ్ఞాలు సురనర ప్రీతిగా చేసి పూర్వుల కీర్తికి మిన్నగా కీర్తినార్జించాడు. వాని పేరుతో నాభి వర్షం భరత ఖండముగా ప్రసిద్ధమయింది. వాని తండ్రి భూభారమంతా కొడుకుపై ఉంచి తపశ్చర్యకై పులహాశ్రమానికి వెళ్లిపోయాడు.
భరతుడు చిరకాలం రాజ్యం పాలించి కొడుకుని సుమతిని పట్టాభిషిక్తుణ్ణి చేసి సాలగ్రామ క్షేత్రానికి వెళ్లాడు. పతిని ఆరాధించి తనుత్యాగం చేసి మలిజన్మలో బ్రాహ్మణుడుగా పుట్టాడు.
భరతనందనుడైన సుమతికి కలిగిన సుతుడు ఇంద్రద్యుమ్నుడు. అలాగ భరతవంశం విస్తరించింది అని పరాశరుడు చెప్పగా విని మైత్రేయుడు సరే. ఇక భూమండల వైశాల్యం, సప్తద్వీప చరిత్ర, నదీసాగర పర్వత విస్తార విషయం, సురాసుర గంధర్వ నగరవృత్తాంతం వినాలని ఉన్నది. చెప్పవలసిందని అనగా ఆ ఆచార్యుడు శిష్యుడికి చెప్పాడు.
శిష్యా! నీవడిగిన విషయం సమగ్రంగా చెప్పడం చాలాకాలం అవుతుంది. అలా చెప్పడం అసాధ్యం. సంగ్రహించి చెప్తాను విను.
ఏడు ద్వీపాలకూ చుట్టు లవణ, ఇక్షు, సురా, సర్పి, దధి, క్షీర, జల సముద్రాలుంటాయి. అవి ఒకదానికి ఒకటి రెండింతలు విస్తీర్ణములు. ఈ ద్వీపాలకు నడుమ ఉన్నది జంబూద్వీపం. దానిమధ్య నున్నది మేరుపర్వతం. అది యక్షకిన్నర గంధర్వ తాపస దేవతల నివాసముగా చెప్పదగినది. దానికి దక్షిణముగా హిమగిరి, హేమకూటం, నిషధ పర్వతం - తూర్పు పడమర దిక్కులకు వ్యాపించి సమున్నతములై ఉన్నాయి.
నీలాచలం, వెండికొండ, మేరు పర్వతానికి చెప్పవలసిన శిఖరాలు.
ఒక్కొక్క పర్వతం రెండువేల యోజనాల విస్తీర్ణం, ఔన్నత్యం కలవై దక్షిణోత్తర భాగాలలో ఉంటాయి.
తూర్పున దేవకూటం, పడమటను జఠరపర్వతం ఉంటాయి.
మేరుపర్వతానికి దక్షిణమున భారతకింపురుష హరివర్షములు, ఉత్తరాన రమ్యక హిరణ్మయ కింపురుష వర్షములు, తూర్పున భద్రాశ్వ వర్షం, పడమటను కేతుమాలావర్షం - వాటి నడుమ ఇలా వృతవర్షం ఉన్నాయి.
_*జై శ్రీమన్నారాయణ*_
_*జై శ్రీమన్నారాయణ*_
_*జై శ్రీమన్నారాయణ*_
_*సర్వేజనా సుఖినోభవంతు...*_
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️