02/05/2018
పెళ్లి చేసి చూడు..ఇళ్లు కట్టి చూడు అని పెద్దలు ఊరికే అనలేదు. పేదవారింట్ల పెళ్లి చేయాలంటే అదో పెద్ద భారం.అందులోనూ ఆడబిడ్డ పెళ్లి అంటే ఇక అంతే సంగతులు.కట్నకానుకలు ఇచ్చేందుకు ఆ తండ్రి జీవితాంతం సంపాదించిన కష్టాన్ని వదులుకోవాల్సిందే.ఇక బట్టలు,బంగారు ఆభరణాలు, పెండ్లి ఖర్చులు ఇవన్నీ అదనం. ఈ రోజుల్లో ఏ చిన్న ఫంక్షన్ చేయాలన్నా వేలకు వేలు కావాల్సిందే.ఇంకాస్త గ్రాండ్ గా చేయాలంటే లక్షల్లో ఉంటుంది ఖర్చు. తమ స్థోమత కొద్దీ చేసినా భారం భారీగానే పడుతోంది. ఇక అప్పు తెచ్చి పెళ్లి చేసే వాళ్లే అనేకం.ఆ అప్పుకు వడ్డీ కట్టలేక ఆ ఆడబిడ్డ తల్లిదండ్రులు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు.
ఈ కష్టాలను చూసి ప్రభుత్వాలు కూడా ముందుకొస్తున్నాయి.ఆడబిడ్డల పెళ్లిల్లు తల్లిదండ్రులకు భారం కాకూడదని భావించి, పెళ్లి కానుక పేరిట సాయం చేస్తున్నాయి.తాజాగా ఏపీ సర్కార్ ఓ మంచి నిర్ణయాన్ని తీసుకుంది. పేద తల్లిదండ్రుల పాలిట వరంగా మారింది ఈ పథకం. సామాజికవర్గాన్ని బట్టి ఆడబిడ్డల పెళ్లికి భారీగా సాయం చేస్తామని ముందుకొచ్చింది ఏపీ సర్కార్. ఏప్రిల్ 20 నుంచి జరుగుతున్న పెళ్లిళ్లు అన్నింటికీ ఈ కానుకలు వర్తించేలా ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. అయితే ఏప్రిల్ 20 నుంచి మే 4 వరకు పెళ్లిళ్లు ఉన్నవారికి కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.ఇక మే 5 తర్వాత జరిగే వివాహాలకు సంబంధించి వధూవరులు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఒకే విడతలో నగదును అందించనుంది ప్రభుత్వం.
ఈ కానుక కు సంబంధించిన లబ్దిదారులంతా జస్ట్ 1100(కాల్ సెంటర్) ఫోన్ నెంబర్ కు కాల్ చేసి వారి వివరాలను నమోదు చేసుకోవాలి.ఆ తర్వాత పెళ్లికి సంబంధించిన పత్రిక, వధూవరులకు సంబంధించిన వివరాలను ఆన్ లైన్ ద్వారా అందజేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలంటే
మీ సేవా కేంద్రాలు..
చంద్రన్న పెళ్లి కానుక వెబ్‌సైట్..
పెళ్లికానుక యాప్
మండల మహిళా సమాఖ్యలు
రిజిస్ట్రేషన్ కోసం ఉండాల్సిన పత్రాలు
వివాహ శుభలేఖ
బ్యాంకు ఖాతా సంఖ్య
వధువు ఆధార్ నంబరు
రేషన్‌కార్డు నంబరు
కుల ధ్రువీకరణ పత్రం
జనన ధ్రువపత్రం
దివ్యాంగులకు సదరం ధ్రువీకరణ పత్రం
ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు కార్మికులయితే గుర్తింపు కార్డు
ఏపీ బిల్డింగ్, నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సభ్యత్వం ఉంటే కార్మికుడి రిజిస్ట్రేషన్ సంఖ్య
వధూవరులకు కావాల్సిన అర్హతలు
-ప్రస్తుతం విద్యార్హత లేదు
-వివాహానికి కనీసం 15 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలి. (ఏప్రిల్ 20 నుంచి మే 4 వరకు పెళ్లిళ్లకు మినహాయింపు). ఎంత ముందుగా దరఖాస్తులు చేసుకున్నా వివాహ తేదీకి 30 రోజుల ముందు మాత్రమే పరిశీలన మొదలుపెడతారు.
-నమోదు చేసుకున్న 24 గంటల్లోపు వుధువు/వరుడు ఫోన్ నంబరుకు ఫోన్ చేసి వివరాలను 1100 కాల్ సెంటర్ నుంచి ధ్రువీకరించుకుంటారు. ఇద్దరిలో ఏ ఒక్కరూ సరిగా సమాధానాలు చెప్పకపోయినా నమోదు రద్దవుతుంది.
– వధూవరులిద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారై ఉండాలి. పెళ్లి తేదీ నాటికి వధువు వయసు 18 ఏళ్లు, వరుడు వయసు 21 ఏళ్లు నిండాలి. ఇద్దరి వివరాలు ప్రజా సాధికార సర్వేలో నమోదవ్వడం కీలకం.
– మొదటి వివాహం చేసుకొనేవారు మాత్రమే పథకానికి అర్హులు. (పెళ్లై భర్త మతి చెందిన వితంతువులు రెండో పెళ్లి చేసుకుంటే పథకానికి అర్హులుగా పరిగణిస్తారు).
-దరఖాస్తు చేసే నాటికే వివాహ వేదిక, తేదీల నిర?యం జరగాలి. వివాహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోనే జరగాలి.
– వధువు ఆధార్ నంబరుకు ఆమె బ్యాంకు ఖాతా అనుసంధానం తప్పనిసరి. వధూవరుల్లో ఏ ఒక్కరిదైనా ఆధార్ నంబరుకు ఫోన్ నంబరు అనుసంధానమై ఉండాలి.
కానుక ఎంత అంటే….
గిరిపుత్రికలకు రూ. 50 వేలు , ఎస్టీ కులాంతర వివాహానికి రూ.75 వేలు, ఎస్సీలకు రూ.40 వేలు, ఎస్సీ కులాంతర వివాహానికి రూ.75 వేలు, దుల్హన్‌కు రూ. 50 వేలు, బీసీలకు రూ. 35 వేలు, బీసీ కులాంతర వివాహానికి రూ. 50 వేలు, విభిన్న ప్రతిభావంతులుకైతే రూ. లక్ష ఇస్తారు.
కల్యాణ మిత్రలకు ప్రోత్సాహకాలు..
చంద్రన్న పెళ్లి కానుకలో కల్యాణ మిత్రలే కీలకం. వీరే క్షేత్రస్థాయిలో నిర్ధారణ చేస్తారు. ఇందుకు గాను ఒక్కో వివాహ పరిశీలనకు రూ.300 ప్రభుత్వం అందిస్తుంది. వివాహ పరిశీలన ఫొటో అప్‌లోడ్‌కు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల లోపు ముహూర్తాలకు రూ.250, సాయంత్రం 7 తరవాత, ఉదయం 9 గంటల లోపు ఉన్న ముహూర్తాలకు రూ.500 చెల్లిస్తారు. అయితే వీరు క్షేత్ర పరిశీలనలో ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినట్లు రుజువైతే తగిన చర్యలు తీసుకుంటారు.
లబ్ధిదారులను గుర్తించేది ఎలా..?
లబ్ధిదారు దరఖాస్తు చేసుకున్న తరవాత కల్యాణ మిత్రలు క్షేత్ర పరిశీలన చేసి ధ్రువీకరిస్తారు.
మండలంలోని ఏ కల్యాణ మిత్రను పరిశీలనకు పంపాలన్నది కంప్యూటర్ సాయంతో నిర్ణయిస్తారు. కల్యాణ మిత్రలు వధువు, వరుడు చేతి గుర్తులు తీసుకుంటారు. ఇద్దరి చిత్రాలు తీస్తారు. తల్లిదండ్రులు, గార్డియన్ వేలి ముద్రలు సేకరిస్తారు. వివాహం కుదిరినట్లు ధ్రువీకరణగా ఇరుగు పొరుగు వారి ఆధార్ నంబర్లు, వేలి ముద్రలు తీసుకుంటారు.. ఇవన్నీ పూర్తయ్యాక ప్రోత్సాహకం ఎంత మంజూరైందన్నది వధువు, వరుడు ఫోన్‌కు సంక్షిప్త సమాచారం అందుతుంది. ఆ వెంటనే 20 శాతం వివాహ ప్రోత్సాహకం విడుదల చేస్తారు. వివాహ అధికారి ఆమోదించిన తరవాత వివాహ ధ్రువీకరణ, ఫొటోను అప్‌లోడ్ చేయాలి. వివాహ అధికారి ధ్రువీకరించి ఆమోదిస్తారు. వివాహ సర్టిఫికెట్ విడుదల చేస్తారు.
ఆ వెంటనే వధువు బ్యాంకు ఖాతాకు మిగిలిన 80 శాతం ప్రోత్సాహకం జమ చేస్తారు.