15/07/2024
NANDALUR TEMPLE FETE COMMENCES _ ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు
ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2024 జూలై 14: అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం 7.45 నుండి 8.15 గంటల వరకు కర్కాటక లగ్నంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. అనంతరం ఆస్థానం ఘనంగా జరిగింది.
శ్రీ సౌమ్యనాథస్వామి, ధ్వజపటం, చక్రత్తాళ్వార్, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని ఉద్దేశం.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దిలీప్ పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగుతాయి.
వాహనసేవల వివరాలు :
తేదీ
14-07-2024
ఉదయం – ధ్వజారోహణం
రాత్రి – యాలి వాహనం
15-07-2024
ఉదయం – పల్లకీ సేవ
రాత్రి – హంస వాహనం
16-07-2024
ఉదయం – పల్లకీ సేవ
రాత్రి – సింహ వాహనం
17-07-2024
ఉదయం – పల్లకీ సేవ
రాత్రి – హనుమంత వాహనం
18-07-2024
ఉదయం – శేష వాహనం
రాత్రి – గరుడ వాహనం
19-07-2024
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
20-07-2024
ఉదయం – ఆర్జిత కల్యాణోత్సవం (ఉదయం 10 గంటలకు)
రాత్రి – గజ వాహనం
21-07-2024
ఉదయం – రథోత్సవం (ఉదయం 9 గంటలకు)
రాత్రి – అశ్వవాహనం
22-07-2024
ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం
జూలై 20వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. జూలై 23న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.