28/04/2025
*శ్రీశ్రీశ్రీ కొత్తపురి ఎల్లమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠ*
*మూడు రోజుల పాటు హోమాలు*
*కొట్టే కృష్ణయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు*
*విశేషంగా హాజరైన భక్తజనాలు*
*రాయచోటి ప్రతినిధి మేజర్ న్యూస్ :*
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, ఆదిపరాశక్తి స్వరూపిణి, గ్రామప్రజల ఆరాధ్యదేవత శ్రీ కొత్తపురి ఎల్లమ్మ తల్లి (కొత్తపురమ్మ) నూతన దేవస్థానము విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువు వైశాఖ మాస శుద్ధ పాడ్యమి సోమవారము నుండి బుధవారము వరకు త్రయాహ్నిక దీక్షతో జరుగునని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. సోమవారం ఉదయం గణపతి పూజ, స్వస్తివాచనము, అఖండ దీపారాధన, ఋత్వికరణం, పంచగవ్య ప్రశానము, మృత్సుగ్రహణం, కలశస్థాపన, అభిషేకములు, మహామంగళహారతి, తీర్థప్రసాద వితరణ, వాస్తుమంటపారాధన గావించారు. సాయంత్రం ప్రోదషకాలపూజలు, మూలమంత్రజపములు, అభిషేకములు, యాగశాలా ప్రవేశం, దీక్షా హోమములు, సహస్రనామ పారాయణం, కుంకుమార్చన, జలాధివాసము, మహామంగళహారతి, వేదపారాయణం పటించారు. మంగళవారం ఉదయం ప్రాత:కాలపూజలు, అభిషేకములు, చండీసప్తశతి పారాయణము, దేవీభాగవత పారాయణము, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, దీక్షా హోమములు, తీర్థప్రసాదములు, మహామంగళహారతి జరుగునని కమిటీ సభ్యులు తెలిపారు. సాయంత్రం ప్రదోషకాలపూజలు, మూలవిగ్రహ జపములు, మహాస్నపన కలశస్థాపనము, అభిషేకాదులు, దీక్షాహోమములు, మహామంగళ హారతి, వేద పారాయణం, తీర్థప్రసాద వితరణ జరుగునని తెలిపారు. మంగళవారం రాత్రి దేవస్థాన ప్రాంగణ మాడవీధులలో అంగరంగ వైభవముగా, విద్యుత్ దీపాలంకరణలతో, కోలాట భజనలతో చాందినిబండ్లతో విగ్రహ ఊరేగింపు జరుగునని తెలిపారు.
30వ తేదీ బుధవారము ఉదయం ప్రాత:కాలపూజ, అభిషేకములు, దీక్షాహోమములు, రోహిణి నక్షత్ర జయుక్త మిధునలగ్న పుష్కరాంశమందు 10.15 గంటలకు యంత్రప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ, నేత్రోన్మిలనము, కళావాహన, చతుషష్యు పచారపూజ, మహాకుంభాభిషేకము బలిహరణ, పూర్ణాహుతి, మంగళహారతి జరుగునని తెలిపారు. ఈ మూడు రోజులు పాటు జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.