08/10/2025
విద్యతో పాటు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి – ప్రధానోపాధ్యాయుడు కత్తి శ్రీనివాసులు పిలుపు
సింగరాయకొండ, అక్టోబర్ 8:
గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు విద్యతో పాటు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకుని ఉన్నత స్థాయిలో రాణించాలని సింగరాయకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కత్తి శ్రీనివాసులు, చెన్నిపాడు హెచ్.ఎం ఎ. వేణుగోపాల్ రావు పిలుపునిచ్చారు.
బుధవారం పాఠశాల క్రీడామైదానంలో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-19 బాలుర అథ్లెటిక్స్ పోటీలను వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ,
“కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామస్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి క్రీడలను ప్రోత్సహిస్తూ అవసరమైన వసతులు కల్పించడం హర్షణీయం. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలి,” అని అన్నారు.
వ్యాయామ ఉపాధ్యాయుడు వేల్పుల వెంకట్రావు మాట్లాడుతూ, “క్రీడల్లో విజయం సాధించాలంటే సమయపాలన, క్రమశిక్షణ, కఠోర శ్రమ, క్రీడాస్ఫూర్తి అవసరం. పాఠశాల వనరులతో పాటు స్థానిక దాతల సహకారంతో క్రీడా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి,” అని సూచించారు.
ఈ పోటీల్లో పొన్నలూరు మండలం చెన్నిపాడు పాఠశాల పదవ తరగతి విద్యార్థి డబ్బుగొట్టు మనోహర్ 400 మీటర్లు, 800 మీటర్ల పరుగు పందెంలో జిల్లా ప్రథమ స్థానం సాధించి ప్రశంసలు పొందాడు.
కార్యక్రమంలో క్రీడాకారులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొని అభినందనలు తెలిపారు.
⸻
#సింగరాయకొండ #అప్డేట్స్
Singarayakonda Updates
www.fb.com/singarayakondaupdates
singarayakondaupdates.blogspot.com
instagram.com/singarayakondaupdates.