30/07/2025
*యువతకు నైపుణ్య శిక్షణ – తిరుపతి జిల్లాలో ఇండస్ట్రీ 4.0 అమలుపై స్పష్టత*
*పార్లమెంటులో తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రశ్నకు కేంద్రం సమాధానం*
ఆధునిక సాంకేతిక రంగాల్లో యువతకు నైపుణ్య శిక్షణ కోసం కేంద్ర బడ్జెట్లో ప్రవేశ పెట్టిన ఇండస్ట్రీ 4.0 అమలు కోసం తీసుకుంటున్న చర్యలపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి బుధవారం లోక్‌సభలో వివరాలు కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా తిరుపతి జిల్లాలో ఇండస్ట్రీ 4.0 ఆధారిత శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయా, ఐజర్, ఎస్వీ యూనివర్సిటీ, లేదా ఇతర నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ఈ రంగాల్లో శిక్షణ అందించేందుకు ఎంపికయ్యాయా, తిరుపతి వంటి జిల్లాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ పరిశ్రమకు మద్దతు, ప్రోత్సాహకాలు ఇచ్చారా, ఇండస్ట్రీ 4.0, డిజిటల్ తయారీ వంటి జాతీయ కార్యక్రమాల ద్వారా తిరుపతి యువతకు ప్రత్యక్ష లాభాలు వచ్చేలా కేంద్రం ఎటువంటి ప్రణాళికలు రూపొందించిందో వివరాలు కావాలని కోరారు.
ఈ ప్రశ్నకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖా సహాయ మంత్రి జితిన్ ప్రసాద సమాధానం ఇచ్చారు. ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ ప్రోగ్రామ్ కింద 2.79 లక్షలకు పైగా అభ్యర్థులను చేర్చుకుందని, ఈ కార్యక్రమం నాస్కామ్ తో సహకారంతో నడుస్తోందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, రోబోటిక్స్, త్రీడి ప్రింటింగ్, సైబర్ సెక్యూరిటీ మొదలైన అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం దీని లక్ష్యం పేర్కొన్నారు.
ఇటీవల తిరుపతిలో ఎంపి గురుమూర్తి కృషితో ఏర్పాటు చేయబడిన నైలెట్ కేంద్రాన్ని స్థాపించిన విషయం అందరికి విదితమే, ప్రస్తుతం తిరుపతి నైలెట్ కేంద్రంలో పైన పేర్కొన్న కోర్సులే కాకుండా పైథాన్ ప్రోగ్రామింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్ మరియు డ్రోన్ టెక్నాలజీ వంటి కార్యక్రమాలను అందిస్తోందని తెలియజేసారు.
తిరుపతిలోని సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ కేంద్రంలో స్థానిక ఐటి పరిశ్రమ, స్టార్టప్‌లు, వాటి వ్యవస్థాపకులకు ఇంక్యుబేషన్ సేవలతోపాటు పలు సేవలను అందిస్తోందని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లు ఏర్పాటు చేసిందని ఇందులో తిరుపతి జిల్లా సత్యవేడు మండలం, చెరివి గ్రామంలో, ఏర్పేడు మండలం, వికృతమాల గ్రామం, రేణిగుంట, ఏర్పేడు మండలాల పరిధిలోని తిరుపతి విమానాశ్రయం సమీపంలో, వైఎస్సార్ కడప జిల్లా, కొప్పర్తిలో సుమారు 62 కంపెనీలు రూ. 6,421 కోట్లతో 59,694 మందికి అదనపు ఉపాధి కల్పించే అవకాశం ఉందని తెలియజేసారు. ప్రభుత్వం 2021లో విశాఖపట్నంలో ఇండస్ట్రీ 4.0పై కల్పతరు సెంటర్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని స్థాపించింది. ఇప్పటివరకు, కల్పతరు 45 స్టార్టప్‌లకు మద్దతు ఇచ్చిందని తెలియజేసారు.