28/08/2026
ఇది సామాన్యుల చరిత్ర... ఈ రాణి ప్రేమ పురాణం , ఆ ముట్టడికైన ఖర్చులూ, మతలబులూ, కైఫీయతులూ ఇవి కావోయ్ చరిత్రసారం అని శ్రీశ్రీ అన్నట్టు... ఇది సామ్రాజ్యాల వెనుక ఉన్న చిన్న చిన్న సంస్థానాల కథ.
అధికారాన్నీ, భూములనీ ఏలాలనుకున్న వాళ్లకీ, ప్రజలకీ మధ్య జరిగిన పోరాట చరిత్ర. వృత్తి కళాకారుల తిరుగుబాటు కథ... కాదు కాదు గాథ. ఇదంతా కేలం కొన్ని చుక్కలు కలుపుకుంటూ అల్లిన ఊహ కాదు. నిజమైన చరిత్రని పట్టితెచ్చిన నవల #సుళుంది.
మంగలి వాళ్లైన వృత్తి కళాకారుల ఆగ్రహం, క్షురక వృత్తి అంటే అంతఃపుర వైద్య వృత్తిగా కూడా కొనసాగిన కాలం, ఆనాటి చరిత్రలో వాళ్లు పోషించిన పాత్రా, సైనికుల తరవాత అధికారికంగా కత్తిపట్టి తిరిగిన నాపితులు (మంగలివాళ్లు) ఆ నాటి రాజకీయాలని ప్రభావితం చేసినతీరు, ప్రాచీన కాలంలో గ్రామాలను కాపాడుకున్న వైద్యుల మీద జరిగిన ఎన్నో దాడులు. వాటికి కారణమైన అధికార దాహం...
రక్తంతో తడిసిన చరిత్రని ఆ నెత్తుటి వాసన పోకుండా తెచ్చిన ప్రయత్నం.
శైవాలయాలని ధ్వంసం చేసి వైష్ణవాన్ని బలవంతగా ప్రజల్లోకి ఎక్కించడం. ప్రజలని ఇస్లామ్‌లోకీ, క్రైస్తవ్యంలోకీ మార్చటానికి ఏఏ శక్తులు పనిచేసాయీ... ఇట్లా ఒక్కొక్క విషయం తెలుస్తుంటే, అసలు మనం చరిత్ర అనుకునే వైభం వెనుక ఉన్న విషాదమెంతో తెలుస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది... ఈ పుస్తకం చదవటం ఓ అనుభవం, సుళుందీ అనే పేరు వెనుక ఉన్న విషయం మరో ఆశ్చర్యం.... నిప్పును వెలిగించుకోవటాని ఊరంతా ఆ నిప్పును పంచుకోవటానికీ ఎంత పోరాటం జరిగిందో, ఒక కర్ర ముక్కని దగ్గర ఉంచుకునేందుకు కూడా రాజాఙ్ఞ అవసరం పడిందో తెలుస్తుంటే, కులం, మతం ఎంతటి దారుణాలని సృష్టించాయో గుర్తు చేసుకోవాలంటే ఆ కొండల్లోకి అడుగు పెట్టాల్సిందే.
17వ శతాబ్దంలో, 72 భాగాలుగా విభజించుకొని తమ రాజ్యాన్ని పాలించిన విజయనగర రాజుల పాలన డిల్లీ సుల్తానుల దాడితో పూర్తిగా పతనమైంది. ఆతరువాత ఆ 72 సంస్థానాలు తమను తము సొంత రాజులుగా ప్రకటించుకున్నరు. ఆ నేపథ్యంలో ఆనాటి సమాజంలో జరిగే సామాజిక-రాజకీయ మార్పుల్ని ఈ నవల అద్బుతంగా వివరిస్తుంది . ఈ నవలలో వర్ణించిన విభిన్న సమాజపు వర్గాలూ, వారికి సంబంధించిన చారిత్రక విశేషాలూ స్పష్టంగా తెలుస్తాయి. ఒక్కొక్క మనిషీ తన సమాజం కోసం ఎంత జీవితాన్ని ధరపోస్తే ఇప్పుడు మనముంటున్న సమాజం ఏర్పడిందో, పాలకుల, రాజుల దౌర్జన్యాలకి, శమదోపిడీకీ వ్యతిరేకంగా ఎంతమంది ప్రాణాలిచ్చారో... తెలుస్తుంది...
ప్రాచీన సిద్ధవైద్యం, పేలుడు మందు తయారీ ఏ ఏ అవసరాలకోసం మొదలైందో, కులాల అణచివేత పేరుతో భూముల దోపిడీ ఎలా సాగిందో, విదేశీయులో... అని అరుస్తున్న ముస్లిమ్‌లని మొదట ఈ దేశంలోకి తెచ్చిందెవరో అర్థమవుతుంది. సంస్థానాల మీద పట్టుకోసం, అధికారం జరిగిన పోరులో మరణాలు ఎవరివో ఎందుకో బోధపడుతుంది....
శైవవష్ణవ వివక్షా పూరిత పోరాటాలు ఎంతెంత రక్తం పారించాయో, ఈ దేశపు నాశనంలో ఎవడి కుట్రల భాగమెంతో ఈ నేల సౌభాగ్యానికి ఎవడి రక్తం ఎంత పారిందో అర్థమవుతుంది.
కేవలం అనుమానంతో వందలమంది ప్రజా వైద్యులను చంపించిన క్రౌర్యం వేరే మతం వాదిది కాదు, ఇక్కడి నేల మీది ఆయుర్వేదం, సిద్ధవైద్యం పూర్తిగా నాశనం కావటానికి కారణం ఇప్పటి కార్పోరెట్ వైద్యం రాక కాదు, అంతకు ముందే భయంకరమైన కుట్ర జరిగింది...
మంగలులు, చాకల్లూ రాజ్యాధికారాన్ని ఎలా ప్రభావితం చేయగలిగారు, ఓ మహా విప్లవం పుట్టకుండానే ఎలా అంతమైందో చెప్పే ఈ కథ కేవలం ఫిక్షన్ కదు, ఈ పాత్రలన్నీ ఊరికే అట్లా ఊహల్లోంచి వచ్చినవి కాదు. ఇది చరిత్ర, ఈ దేశపు చరిత్ర, మహోన్నత విజయనగర సామ్రాజ్య పతనం తరవాత జరిగిన మహా కౄరమైన చరిత్ర....
ఈ నవల రాయటానికి రచయిత ముత్తునాగు దాదాపు పదిహేనేళ్లు రీసెర్చ్ చేశారు. ఇక పుస్తకం వచ్చాక నాలుగే నాలుగేళ్లలో 25 మంది కేవలం ఈ పుస్తకం మీదే పీహెచ్‌డీ చేశారు. తమిళ సాహిత్యంలో ఓ సంచలనమైన ఈ నవల ఇప్పుడు బాలాబుక్స్‌లో తెలుగులో అందుబాటులో ఉంది.