20/08/2020
అల్లూరి సీతారామరాజు (1897 - 1924)
స్వాతంత్ర్య ఉద్యమం నాయకడు.
నేటి విజయనగరం జిల్లా, పద్మనాభం అనే గ్రామంకు దగ్గరులో గల పాండ్రంగి గ్రామంలో అల్లూరి సీతారామ రాజు జననం జరిగింది. రామరాజు తల్లి గారి ఊరు 'పాండ్రంగి గ్రామం'. 1897 జూలై 4 తేదిన తాతగారైన మందలపాటి శ్రీరామరాజు గారి ఇంటిలో రామరాజు (సీతారామరాజు) పుట్టినాడు. రామరాజు తల్లి పేరు సూర్యనారాయణమ్మ, తండ్రి పేరు వెంకట రామరాజు. పశ్చిమ గోదావరిజిల్లా లోని 'మోగల్లు' అనే గ్రామం వెంకట రామరాజు (సీతారామరాజు తండ్రి) స్వగ్రామం. ఉద్యమం నాయకడైన రామరాజు జీవితం ఉభయ గోదావరి జిల్లా, విశాఖ జిల్లాలో సాగింది. ఇతడు తన పేరును 'సీతారామరాజు' గా మార్చుకొన్నాడని ఒక వ్యావహారిక గాథ కలదు.
అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. బ్రిటిషు పాలకులను ఎదిరించి సాయుధ పోరాటం చేసిన యోధుడు. 1918 నుంచి ఏజన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. శ్రమదోపిడి, ఆస్తుల దోపిడి, స్త్రీల మానహరణం సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవి. మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చెయ్యాలని సీతారామరాజు నిర్ణయించుకున్నాడు. గిరిజనులకి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు. మన్యంలో చుట్టు పక్కల 30 నుంచి 40 గ్రామాల ప్రజలకు సీతారామరాజు నాయకుడయ్యాడు. మన్యం లోని గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేయ్యసాగాడు. అతని అనుచరుల్లో గాము గంటందొర, గాము మల్లుదొర, కంకిపాటి ఎండు పడాలు మొదలగువారు ముఖ్యులు.