
20/03/2024
దేశ రక్షణ దేశం కోసం పోరాడే సైనికుడు చేతిలో ఎంత ఉంటుందో సరైన నాయకుడిని ఎంచుకుని ఓటేసే మన చేతుల్లో అంతే ఉంటుంది:-
2తెలుగు స్టేట్స్ న్యూస్:-
మనం అంటే జనం. జనం లేనిదే ఎన్నికలు లేవు. పాలన లేదు, రాజకీయం లేదు కాబట్టి మనమే ఎన్నికలకు ప్రధాన ఇంధనం. అందరం ఈ విషయాన్ని మర్చిపోయి చాలా కాలం అవుతుంది, కాదు యుగాలే అవుతున్నాయి. మళ్లీ గుర్తు తెచ్చుకుందాం! మనకు మన కోసం ఏర్పాటు చేయబడింది రాజకీయం. మన కోసం మనం ఎన్నుకునే వాడే నాయకుడు. ఎన్నికలు జరుగుతున్నాయి, అంటే అందరిలోనూ ఒక ఉత్కంఠ ఎవరు గెలుస్తారని. కొందరు ఒక పార్టీ గెలుస్తుంది అంటే ఇంకొందరు వేరే పార్టీ గెలుస్తుంది అని చర్చించుకుంటాం.ఈ పార్టీ మేనిఫెస్టో బాగుంది ఆ పార్టీ మేనిఫెస్టో వీక్ గా ఉంది అని ఆలోచిస్తుంటాం. ఎవరు గెలుస్తారు అనే చర్చలు కొనసాగిస్తుంటాం. ఇలా ఆలోచించే మనం ప్రజల కోసం పనిచేసే పార్టీని గుర్తించి గెలిపించుకోగలం అనే నమ్మకాన్ని ఎందుకు కోల్పోయాం? మనకు టైం లేకన లేక మనకెందుకనా? ఏదో ఐదేళ్ల కు ఎన్నికలు వస్తున్నాయి, వెళ్తున్నాయి అనే ధోరణిలో మెకానికల్ గా ఎన్నికల్లో పాల్గొంటున్నాం. మనల్ని ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉన్నతి పరంగా గెలిపించే పార్టీని ఎంచుకొని మనం గెలుద్దాం అనే ఉద్దేశం మనకు లేదా?
నిజంగా ఆయా పార్టీ తెచ్చిన మేనిఫెస్టోలో పథకాలు ఎవరికిఉపయోగపడుతున్నాయి, అవి అసలు ఎవరి కోసం ఏర్పాటు చేశారు? వారికి సక్రమంగా అందుతున్నాయా? అందుబాటులో ఉన్నాయా? ఎప్పుడైనా ఇటువంటి ప్రశ్నలు మీలో వచ్చాయా?
ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకాలను తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఉపయోగపడతాయి. అయితే తెల్ల కార్డు కలిగిన బడుగు, బలహీన, కడుపేద, పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఈ మేనిఫెస్టోల వల్ల ఉపయోగం ఎంత ? ఎవరైనా ఆలోచించారా! ఎప్పుడో రోగం వస్తే ఆరోగ్యానికి ఉపయోగపడే పథకలు కన్నా అసలు రోగం రాకుండా తినే తిండి తినగలిగే పరిస్థితి ఏది? ఏది కొనాలన్నా రేట్లు మండిపోతున్నాయి అందరికీ తెలిసినదే అయినా గుర్తు చేస్తున్న. మధ్యతరగతి కుటుంబాలే బతుకు బారమై ఒకవైపు వేలు దాటుతున్న ఇళ్ల అద్దెలు కట్టాలా, ఆకాశాన్ని అంటుతున్న సరుకుల ధరలు చూసి తిండి తినడం మానాలా అర్థం కాని పరిస్థితుల్లో కొట్టు మిట్టడుతూ బతుకు జీవుడా అంటూ జీవితాలు వెల్లదీస్తున్నారు.
వీరి పరిస్థితి ఇలా ఉంటే ఒకవైపు కడు పేద కుటుంబాలకు సంబంధించిన వారు ఎలా బ్రతకాలి బ్రతుకా, చావా అని ఆలోచనలో మురికివాడలో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ధనవంతుడు ధనవంతుడు లానే ఉంటున్నాడు. మధ్యతరగతి వాడు పేదవాడు అవుతున్నాడు. పేదవాడు కడుపేదవాడై బతుకు బండి నడపలేక చతికల పడుతున్నాడు. ఏమిటి ఈ దుస్థితి ఇక మన బాధ్యత కలిగిన ప్రభుత్వ పథకాలు వారికి ఉపయోగపడుతున్నాయ? రైతులలో కూడా సొంత భూమి కలిగి వ్యవసాయం చేసేవారు చాలా తక్కువ కనిపిస్తారు మరి రైతు భరోసాలు ఎవరికి, ఎవరిని ఆదుకోవడానికి??
మహిళలకి, యువతకి ఇంతిస్తాం మీకోసం ఈ పథకం అనే బదులు నిరుద్యోగ యువతకి ఉద్యోగం ఇవ్వమని మనం మన దగ్గరికి వచ్చిన అభ్యర్థులను ఎందుకు ప్రశ్నించం? ఈరోజు చూసుకుంటే ప్రతి ఇంట్లోనూ డిగ్రీలు చదివి ఖాళీగా నిరుద్యోగులుగా ఉంటున్నారు వారికి ఉద్యోగం ఇచ్చే పథకాన్ని ఎందుకు తీసుకురారు ఒకవేళ ప్రవేశపెట్టిన అది అమలు కాదు ఎందుకు??
అంటే బాధ్యత గల యువత తగ్గిపోయారు. వారు ప్రశ్నించడం మర్చిపోయారు, అందుకే ఎన్ని పథకాలు ప్రవేశపెట్టిన అవి అమలులోకి రావట్లేదు. ఇకనైనా యువత బాధ్యతను తెలుసుకుని వారి భవిష్యత్తు కోసం వారు ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఓటు వేస్తే గెలిచే నాయకులకు మన ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యత ఉంది అని మనం గుర్తుంచుకోవాలి.
ఐదు సంవత్సరాలలో గుర్తులేని మనం, ఎలక్షన్స్ రాగానే మన ఇల్లు, ఇంట్లో వాళ్లను వెతుక్కుంటూ వచ్చి మరి ఓట్లు అడుగుతారు. కానీ మనం ఓటు వేయడం పనిలా భావించి వేసి వస్తున్నాం. మనం మర్చిపోయాం అసలు వారు మనకు ఏ విధంగా ఉపయోగపడతారూ, వారిని ఎందుకు
ఎంచుకుంటున్నామని. ఇలా ఒక విషయంలో కాదు మనం ఎన్నుకుంటున్న పార్టీలు గెలిచాక మనం వారి పాలనలో మనుషులలా చూడడం లేదు కుర్చీలను కాపాడుకునే యుద్ధంలో సైనికులుగా మారిపోతున్నారు. ఎవరైనా రాజకీయాల్లోకి వెళ్తున్నారు అని చెప్పంగానే మనమడిగే ప్రశ్న ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? దానికి వారి సమాధానం ప్రజలకు సేవ చేయడానికి ఇప్పుడు జరుగుతున్న పాలనలో ప్రజాసేవ చేసే పాలకులు ఎంతమంది? కాబట్టి ఇప్పటికైనా ఆలోచిద్దాం మనకు పథకాలు ఎంత ఉపయోగపడుతున్నాయి, వాటి వల్ల పేద కుటుంబాలకు ఏమి లాభం? రోజూ మూడు పూటలా అన్నం కూడా తినలేని వారి కోసం మనందరం బాధ్యతగల పౌరులుగా మారి పార్టీ వారిని ప్రశ్నిద్దాం? రాజకీయంలో మార్పు రావాలంటే అసలు రాజకీయం ఎవరికోసం ఏర్పడిందో వారిలో అంటే మనలో మార్పు రావాలి. బాధ్యతగా మనందరం నడుచుకుందాం. పైన అన్ని విషయాలు ఆలోచించి, ఏది మన ముందు తరానికి, ఈ తరానికి, అలాగే పేదవారికి మంచి చేస్తుందో ఆ పార్టీని ఎంచుకోవడంలో రచ్చబండలను వేదికగా చేసుకుని ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. మన ఓటును సమర్థవంతంగా వినియోగించుకున్నాం. దేశ రక్షణ దేశం కోసం పోరాడే సైనికుల చేతిలో ఎంతుంటుందో, ఎంచుకునే నాయకుడి ఆలోచనలో, చేతలలో అంతే ఉంటుంది. ఆలోచించి ముందడుగు వేద్దాం . బాధ్యత గల పౌరులం అనిపించుకున్నాం. పార్టీని ఎన్నుకోవడంలో మన విజ్ఞతకి పని చెబుదాం!