03/07/2025
ఓ తండ్రి క{వ్య}ధ
నేనింక శాశ్వత దూరం అయ్యానని తెలిశాక
విషాదాశ్రులకు నిలయం అవుతాయి
మీ కళ్ళు...
నా కలల సౌధం నుండి, నన్ను ఓల్డ్ ఏజ్ హోముకి మార్చినప్పుడే సగం చచ్చిపోయాను .....
రెండు వీధుల చివర ఓల్డ్ ఏజ్ హోమ్ నుండి, తిన్నగా మార్చురీకి చేరింది నా మృతదేహం.
మూడు రోజులు పోయాక వీధి వాకిట్లో
నిర్జీవంగా పార్థివ దేహం.
అంతిమ యాత్రా శకటం కోసం
ఎదురుచూపులు చూస్తున్నట్లు వున్నారు ..... ???
ఈ విలాపమేదో నేను బ్రతికుండగా
ఆనంద భాష్పాలుగా నా సమక్షంలోనే కారిస్తే పోయేది ఏముందని !!
నా శరీరంతో మరింత సమయం
గడపవలసిన పరిస్థితి మీకు
ఎదురయ్యినట్లు వుంది ...............
గడియారం ముళ్ళుని సెకనుకోమారు
చూస్తూవుంటే కంటకంగా వుంది నాకు !!
తల కొరివిపెట్టే కొడుకులు చావు కబురు తెలిసాకే పయనమయ్యినట్లు వున్నారు.
సానుభూతి పొందడానికి కోడళ్ళు , అల్లుళ్ళు నా మీద ఎన్నడూ లేని ప్రేమని కుమ్మరిస్తూ
బాగానే నటిస్తున్నారు. !!!!
అదేదో నేను సజీవంగా వుండగా నాతో కలిసి పంచుకుంటే పోయేది ఏముందని !!
నా శవం మీద కూతుర్లు పరచిన క్రొత్త పంచెలు
సువాసనలు వెదజల్లే పుష్పగుచ్ఛాలను
సుదీర్ఘ నిద్రలో వున్న నేను ఎలా చూడగలను
అవేవో నా షష్ఠి పూర్తి నాడో,
డెబ్బదియేండ్లు నిండినతరుణానో
నా వంటికి చుట్టపెడితే పోయేది ఏముందని !!
మీతో పాటు బంధువర్గం అంతా నా గురించి నాలుగు మంచి మాటలే మాట్లాడతున్నారు
అయినా అవేవి నా చెవిన పడవు..
నేను మీ అందరితో మాట్లాడాలని
మీ వెంట పడిన రోజున ఒక్కరయినా
మీ చెవికి ఎక్కించుకుని వుంటే
పోయేది ఏముందని !!
మీకు ఆకలయితే నా కడుపు కట్టుకుని పెట్టాను.
నా చితికి మంట పెట్టడం కోసం ఒక్క పూట
కడుపు మాడ్చుకుని వుండలేరా మీరు !?!
వెర్రి తండ్రులు , మీరు ఆకలికి తట్టుకోలేరని మిమ్మల్ని కనిపెంచిన ఈ తండ్రికి తెలియదా !!
భుక్తాయాసంతో నా శరీరం దగ్గర కూర్చోలేక అవస్థ పడుతున్నారని తెలిసి కూడా తెలియనట్లు వుంటే పోయేది ఏముందని !!
తలమీద నుండి చల్లని నీళ్లు తడిసిన బట్టలతో వుండడం మీ భార్య భర్తలకు కష్టంగా వుందనా
పొడిబట్టలతోనే శవాన్ని సాగనంపడానికి సిద్ధంగా వున్నారు ,
నలుగురూ చూసి నానా మాటలు అనేలోపు
కాసేపైనా నా శవం దగ్గర కూర్చుని కన్నీరు కారిస్తే పోయేది ఏముందని !!
నేను పొతే మీకు భాద్యత తగ్గుతుంది
నాకు మోక్షం లభిస్తుంది
ఇది మరణం కాదు విముక్తి చివరిసారిగా...........నారాయణ అంటూ పాడెను పైకి ఎత్తి నన్ను సాగనంపే లోపు
నాన్నా అని గొంతు చించుకుని మీరంతా ఏడిస్తే
నే స్వర్గానికి పోతానేమోనని
భయమేమో మీకు !!!!!!
అయినా నా వెర్రి కానీ , నేను ఎక్కడకి పోయినా
మీకు పోయేది ఏముందని !!
రేపు అందరివి ఇవే బ్రతుకులు
ఏది శాశ్వతం??????? ఎవరు నిశ్చలం???????
✍️లక్ష్మీ అయ్యగారి (అల )
Pc pvr murty uncle