
04/02/2024
తెలంగాణకు ప్రాంతీయ పార్టీ కావాలి
2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. విశ్లేషకులు కూడా విస్తుపోయేలా ప్రజల తీర్పు వచ్చింది. జాతీయ పార్టీ కాంగ్రెస్ కు అధికారం కట్టపెట్టారు. అలాగే, మరో జాతీయ పార్టీ బీజేపీకి కూడా ఓటింగ్ శాతం పెరిగింది. రెండూ జాతీయ పార్టీలు తెలంగాణలో బలపడడం ప్రస్తుతం చర్చనీయాంశం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉండబోతుందనే విషయం స్పష్టమవుతోంది. సుమారు దశాబ్దకాలం పరిపాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ ఎస్ ) భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా పేరు మార్చుకుని, జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. అయితే, ఇటీవలే ఓటమి చెంది, నిరాశలో ఉన్న బీఆర్ ఎస్ మళ్లీ పుంజుకోవడానికి సమయం పట్టేలా ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఢీ కొట్టే బలం ప్రస్తుతానికి బీఆర్ ఎస్ కు లేదని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రెండు జాతీయ పార్టీలను ఎదురుకునేందుకు తెలంగాణలో ఒక బలమైన ప్రాంతీయ పార్టీ ఏర్పాటు అవసరమనిపిస్తోంది.
మనుగడ కోల్పోతున్న ప్రాంతీయ పార్టీలు..
తెలంగాణ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా పోయింది. సుమారు పది సంవత్సరాలపాటు పరిపాలించిన టీఆర్ ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టి బీఆర్ ఎస్ గా అవతరించింది. ఉమ్మడి రాష్ట్రంలో బలమైన పార్టీగా గుర్తింపు పొందిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమైంది. క్యాడర్ ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉంది. ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిలా తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టారు. వైఎస్ ఆర్ టీపీ పేరుతో పార్టీని స్థాపించి, పాదయాత్రలు కూడా చేశారు. కాంగ్రెస్ , బీజేపీలకు దీటుగా అప్పటి బీఆర్ ఎస్ ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేస్తూ ప్రజలను ఆలోచింప చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించి, తీరా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఇటీవల ఆమె తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి, ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. దీంతో తెలంగాణలో ఆ పార్టీ ఉనికి లేకుండా పోయింది. ఎంఐఎం కేవలం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన పార్టీ. పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ బీజేపీ మద్దతుతో పోటీలో ,నిలిచినా అంతగా ప్రభావం చూపలేదు. ఆయన దృష్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే ఉంది. కోదండరాం కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయారు. విశారదన్, కేఏపాల్ తదితరులు ప్రాంతీయ పార్టీలు స్థాపించినప్పటికీ వాటి ఉనికి నామమాత్రమనే చెప్పాలి. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు మనుగడలేని స్థితికి చేరుకున్నాయి.
అసంతృప్తులు - అశావహులు
బీఆర్ఎస్ , బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో అసంతృప్త నేతలు చాలామంది ఉన్నారు. క్యాడర్ ఉన్న లీడర్లు చాలా మంది రాజకీయాల్లో స్తబ్దుగా ఉన్నారు. ఆయా పార్టీల్లో తగిన గుర్తింపు లేక మౌనంగా ఉంటున్నారు. అవకాశం కోసం చాలా మంది వేచి చూస్తున్నారు. అందరినీ కలుపుకుపోయే లీడరు ఎవరైనా ముందుకు వస్తే వెంట నడవడానికి వివిధ పార్టీల్లోని అసంతృప్తులు, అశావహులు సిద్దంగా ఉన్నారు. అలాగే , తెలంగాణ ఉద్యమకారులు , కుల సంఘాలు , ఉద్యోగ సంఘాల నేతలు , విద్ధ్యార్థి సంఘ నేతలు ఇతరులు చాలా మంది ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏర్పడితే స్వాగతించే అవకాశం ఉంటుంది .
ప్రత్యామ్నాయ శక్తికి అనుకూలం
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ పార్టీ ఏర్పడడానికి అవకాశం ఉంది. భారత రాష్ట్ర సమితి జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత తిరోగమన స్థితికి చేరుకుంది. ఉన్న అధికారాన్ని కోల్పోయింది. ఊహించని ఫలితం రావడంతో క్యాడర్‌లో అసంతృప్తి నెలకొంది. రెండు జాతీయ పార్టీలను తట్టుకుని పార్టీని ముందుకు తీసుకువెళ్లడమనేది బీఆర్ ఎస్ కు కత్తిమీద సాములాంటిదే. అయితే, ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రూపొందడానికి అవకాశం ఉంది. వెంటనే కాకపోయినా రాబోయే రోజుల్లో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏర్పడితే దానికి మంచి భవిష్యత్త్ ఉంటుంది.